రామ‌తీర్థం వివాదం … హాట్ అప్‌డేట్ ఏంటో తెలుసా?

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విగ్రహాల ధ్వంసం అంశం ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ముఖ్యంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా రామతీర్థం ఘటనతో రాజకీయ పార్టీలతో రణరంగంగా మారింది.

cm jagan and chandrababu on religion politics

మూడు పార్టీల నేతలు వరుసగా రామతీర్థంలో పర్యటించడంతో… ఉద్రిక్తతంగా మారిన విషయం తెలిసిందే. దీనికి తోడుగా ప‌లువురు స్వామీజీలు , పీఠాధిప‌తులు సైతం రామ‌తీర్థంలో ప‌ర్య‌టించి ఆందోళ‌న వెలిబుచ్చారు. మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌కు కార‌కుల‌ను గుర్తించే ప‌నిలో ఏపీ ప్ర‌భుత్వం ఉంది. ఇదే స‌మ‌యంలో భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం తుది ద‌శ‌కు చేరుకుంది.

రామ‌తీర్థం కోసం విగ్ర‌హాలు రెడీ

రామతీర్థం ఆలయం ఘ‌ట‌నలో ధ్వంసమైన రాముడి విగ్రహం తో పాటు సీతాదేవి, లక్ష్మణుల విగ్రహాలు తిరుపతిలో తయారు చేస్తున్నారు. తిరుపతిలోని టీటీడీ కి చెందిన సంప్రదాయ ఆలయ నిర్మాణం శిల్ప సంస్థలో విగ్రహాల తయారీ జరుగుతోంది. కంచి నుంచి రాయిని తెప్పించి శిల్పులు విగ్రహాలను చెక్కుతున్నారు. పనులు దాదాపు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ వారంలోనే శిల్పులు మూడు విగ్రహాలను అందించనున్నారని స‌మాచారం. నూత‌న విగ్ర‌హాల‌ను శాస్త్రోక్తంగా ప్ర‌తిష్టాప‌న చేయ‌నున్నారు.

చిన‌జీయ‌ర్ స్వామికి సైతం….

మ‌రోవైపు విజయనగరంలోని రామతీర్థంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామి గ‌త‌ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా రామతీర్థంలోని బోడికొండపై ఉన్న రామాలయాన్ని చినజీయర్‌ స్వామి దర్శించుకున్నారు. కొండపై రాముడి విగ్రహ ధ్వంసం ఘటనా స్థలాన్ని స్వామీజీ పరిశీలించారు. ఆలయ పరిసరాలను, విగ్రహం లభించిన నీటి కొలనును కూడా చినజీయర్‌ స్వామి సందర్శించారు . విగ్రహ ధ్వంసం ఘటనకు సంబంధించిన వివరాలను ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఇటీవల ఏపీలో దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులపై ఆయన మండిపడ్డారు. ఆలయాల్లో విగ్రహాలకు రక్షణ కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్వేది రథం దగ్ధం, రామతీర్థం ఘటనలే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుచేశారు.