Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా నిన్న కాకినాడ జిల్లాలో సీఎం జగన్మోహనరెడ్డి, వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర స్థాయిలో స్పందించారు. పవన్ ఒక్క చెప్పు చూపిస్తే తను రెండు చెప్పులు చూపిస్తున్నానని, తప్పులు మాటలు మాట్లాడితే మక్కెలిరిగిపోతాయంటూ హెచ్చరించారు పేర్ని. నారాహి గా పెట్టుకోవాల్సిన వాహనం పేరును వారాహిగా పవన్ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ పూటకొక మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పవన్ గత వీడియోలను చూపిస్తూ .. వాటిలో ఆయన మాట్లాడిన మాటలకూ.. నిన్న చేసిన ప్రసంగానికి పోలిక చూపిస్తూ …మాటల్లో ఎంత తేడా ఉందో గుర్తించాలని పేర్ని అన్నారు.

పవన్ రోజుకు ఒక డైలాగ్ చెప్పి దాన్నే వ్యూహం అంటారని పేర్కొన్నారు. చంద్రబాబు బాగుండటం కోసం పవన్ ఏదైనా చేస్తాడని మండిపడ్డారు. చంద్రబాబు చొక్కా పట్టుకుని పవన్ ఏనాడైనా నిలదీశారా అని ప్రశ్నించారు. పవన్ ఆఫీసులో కూర్చొని సినిమా డైలాగ్ లు, సొల్లు కబుర్లు చెబుతాడని దుయ్యబట్టారు. పవన్ ను అడ్డం పెట్టి జనసేన పార్టీని చంద్రబాబు నడుపుతున్నాడన్నారు. చంద్రబాబు, పవన్, బీజేపీ కలిసి ప్రభుత్వం నడిపినప్పుడు సొంత డబ్బు ఖర్చు పెట్టారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ప్రతి సినిమా రిలీజ్ ముందు కేసిఆర్ కాళ్లు మొక్కుతాడనీ, గులాబీ జెండాను వెనక జేబులో పెట్టుకుని తిరుగుతున్నదెవరని పేర్ని ప్రశ్నించారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆంధ్రరాష్ట్రాన్ని తిడుతుంటే పవన్ ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు.
జగన్ సీఎం అయినప్పటి నుండి పవన్ ఒక్క సినిమా అయినా అగిందా అని అన్నారు. పవన్, బీజేపీ, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సినిమా టికెట్లప జీఎస్టీ వేశారా లేదా అని ప్రశ్నించారు. సినిమాలు బాగుంటే ఆడతాయనీ, సినిమాలు ఆపే అవసరం తమకు లేదని తెలిపారు. ముఖ్యమంత్రి పదవి అనేది ఎవరో దానం చేస్తే వచ్చేది కాదని అన్నారు. ప్రజలను నమ్ముకుంటే మాత్రమే అసెంబ్లీలోకి అడుగు పెడతారనీ, చంద్రబాబును నమ్ముకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరని పవన్ కు పేర్ని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ పరిస్థితులకు అనుగుణంగా తన కులాన్ని మార్చేస్తారనీ, తప్పుడు మాట్లాడుతూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వంగవీటి మోహన రంగా ను హత్య చేయించిన వారితో చేతులు కలిపిన పవన్ కళ్యాణ్ కాపులకు ఆరాధ్యుడు ఎలా అవుతారని ప్రశ్నించారు పేర్ని నాని.
విశాఖలో కలకలం .. వైసీపీ ఎంపీ భార్య, కుమారుడు కిడ్నాప్