ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తుని లో 2016లో జరిగిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ దహనం కేసులో విజయవాడ రైల్వే కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసును కొట్టివేసింది. 24 మంది సాక్షుల్లో 20 మందిని విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. రైలు దహనం ఘటనలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, నేటి మంత్రి దాడిశెట్టి రాజా, నటుడు జీవీ సహా 41 మందిపై కేసులు నమోదు అయ్యాయి. వాదనలు పూర్తి అయిన తర్వాత న్యాయస్థానం స్పందిస్తూ .. దర్యాప్తు ప్రక్రియలో, నేరం రుజువు చేయడంలో రైల్వే పోలీసులు విఫలమయ్యారని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఆధారాలను రైల్వే పోలీసులు కోర్టు ముందు ఉంచలేకపోయారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ముగ్గురు రైల్వే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కోర్టు ప్రశ్నించింది. అనంతరం కేసును కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.

కాగా, గత ప్రభుత్వ హయాంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో పెద్ద ఎత్తున కాపు సామాజికవర్గం ఉద్యమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాపు రిజర్వేషన్ల సాధన కోసం 2016 జనవరి 31న అప్పటి తూర్పు గోదావరి జిల్లా తునిలో బహిరంగ సభ నిర్వహించారు. ఆ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు కొందరు దుండగులు నిప్పు పెటటారు. ఈ ఘటనలో రైలు పూర్తి దహనమైంది. దీంతో రైల్వే పోలీసులు ముద్రగడ పద్మనాభం సహా 41 మందిపై కేసులు పెట్టారు. మరో పక్క పోలీసు విభాగం, గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ) నమోదు చేసిన పలు కేసులను ఇప్పటికే వైసీపీ సర్కార్ ఎత్తివేసింది. అయితే ఆర్పీఎఫ్ కేసు పెండింగ్ లో ఉంది. రైల్వే చట్టంలోని సెక్షన్లు 146, 147, 153, 174(ఎ), (సీ) కింద అప్పట్లో కేసులు నమోదు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన రైల్వే కోర్టు తాజాగా కేసు కొట్టివేసింది.
Breaking: తిరుమలలో ఉగ్రవాద సంచార కలకలం ఫేక్