YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన వైఎస్ భాస్కరరెడ్డి సీబీఐ కోర్టులో మరో కీలక పిటిషన్ దాఖలు చేశారు. తనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అనారోగ్య కారణాలతో ఇటీవల సీబీఐ కోర్టు ఆయనకు 12 రోజులు ఎస్కార్ట్ బెయిల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఎస్కార్ట్ బెయిల్ గడువు ఈ నెల 3వ తేదీన ముగుస్తున్న నేపథ్యంలో అనారోగ్య కారణాలతో బెయిల్ పొడిగింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.

వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ నిందితుడుగా చేర్చిన సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటే ఉన్నారు. వైఎస్ భాస్కరరెడ్డిని మాత్రం సీబీఐ అరెస్టు చేసి చంచల్ గూడ జైల్ కు తరలించింది. ఆయన పలు పర్యయాలు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు, తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఇటీవల తన ఆరోగ్య సమస్య కారణంగా మద్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేయగా, సీబీఐ అధికారులు వ్యతిరేకించారు.
అయితే జైల్ అధికారులు ఇచ్చిన నివేదక ఆధారంగా సీబీఐ కోర్టు న్యాయమూర్తి 12 రోజులు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేస్తూ, హైదరాబాద్ వదిలివెళ్లడానికి వీలులేదని షరతు విధించారు. ఎస్కార్ట్ బెయిల్ లో ఉన్న సమయంలో తాను కంటి ఆపరేషన్ చేయించుకున్నాననీ, మరో రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని, కావున బెయిల్ గడువు పొడిగించాలని భాస్కరరెడ్డి సీబీఐ కోర్టును మరో సారి ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారణ కు స్వీకరించిన సీబీఐ కోర్టు ఈ నెల 3న విచారణ జరపనుంది. సీబీఐ కోర్టు ఆయన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి తీర్పు ఇస్తే మరి కొద్ది రోజులు బయట ఉండనున్నారు. లేకపోతే మళ్లీ ఆయన జైల్ కు వెళ్లాల్సి ఉంటుంది.