ఈ మధ్యకాలంలో చాలామంది తమ జేబు లో పర్స్, డబ్బులు లేకపోయినా హాయిగా బయటికి వెళ్లి ఊరంతా తిరిగి షాపింగ్ చేసేస్తున్నారు. లాక్ డౌన్ మాట అటుంచితే డిజిటల్ పేమెంట్స్ వచ్చినప్పటినుంచి ప్రజలంతా చేతిలో ఫోన్ ఉంటే చాలు ధైర్యంగా బయటకు వెళ్తున్నారు. చెల్లింపులు మొత్తం ఆన్లైన్ ద్వారా నేరుగా అకౌంట్ నుంచి నగదు బదిలీ చేస్తున్నారు. ఇక వాటికి సహకరిస్తూ చాలా యాప్స్ వచ్చేశాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వీటిలో ప్రముఖమైనవి.
అయితే డిజిటల్ పేమెంట్ ఎలా అయితే మానవ జీవితంలో భాగం అయిపోయిందో అదే మొబైల్ లో వచ్చే ఫేక్ న్యూస్ కూడా ప్రజలందరికీ అలవాటు అయిపోయింది. అయితే వచ్చిన వార్త ఫేకా లేకపోతే నిజమైనదేనా అన్న డౌట్ లో జనాలు ఉండిపోతున్నారు. ఇదిలా ఉంటే ఇదంతా ప్రముఖ ఆన్లైన్ చెల్లింపుల యాప్ గూగుల్ పే ను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధించింది అని ఇటీవల పుట్టుకొచ్చిన కొన్ని పుకార్ల గురించి. చాలామంది ఇప్పుడు నగదు బదిలీకి గూగుల్ పే యాప్ ను ప్రాథమికంగా వాడుతూ ఉన్నారు. వారంతా ఈ వార్తతో ఒక్కసారిగా కంగారు పడ్డారు.
అసలే రోజుకొక సైబర్ క్రైమ్ న్యూస్ వింటున్నాం. అదీ కాకుండా కొంచెం వయసులో పెద్దవారు మరియు మధ్యవయస్కులు ఇప్పటికీ యాప్స్ పై సందేహంగా ఉన్నారు. అలాంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే దీనిపై నిషేధం విధించింది అంటే తమ డబ్బులు ఏమవుతాయో అని కొంతమంది కంగారుపడ్డారు. చివరికి దీనిపై రిటైల్ చెల్లింపుల సాధికారిక సంస్థ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పి సి ఐ) తాజాగా క్లారిటీ ఇచ్చింది. గూగుల్ పే ను ఆర్బీఐ నిషేదించలేదని స్పష్టం చేసింది.
గూగుల్ పే చట్టబద్ధమైనదని మరియు అందులో జరిగే లావాదేవీలు సురక్షితమైనదని ఆర్బీఐ నిర్ధారించింది అని ఎన్ సిపిఐ తెలిపింది. ఇకపోతే గూగుల్ పే ను ఆర్బీఐ ధ్రువీకరించలేదు అంటూ అభిజిత్ మిశ్రా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ యాప్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ చట్టాన్ని ఉల్లంఘించిందని…. నగదు బదిలీ చేసేందుకు ఈ యాప్ కు ఆర్బీఐ నుండి అవసరమైన ధ్రువీకరణ లేదని తన పిటిషన్ లో పేర్కొన్నారు గమనార్హం.
యూపీఐ పేమెంట్ అనేది ప్రజల జీవితాల్లో భాగం అయిపోయింది. ఇక న్యాయస్థానం ఆర్బీఐ ను ఇందుకు సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. దీనిపై ఆర్బీఐ స్పందిస్తూ.. గూగుల్ పే ఏ విధమైన పేమెంట్ సిస్టమ్ ని నిర్వహించడం లేదని అందుకే సంస్థ పేరు అధికారిక ఆపరేటర్ల జాబితాలో లేదని తెలిపింది. అయితే వివిధ బ్యాంకుల భాగస్వామ్యంతో యూపీఐ ద్వారా చెల్లింపులు ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు గూగుల్ పేకు చట్టపరమైన అన్ని అనుమతులు ఉన్నాయని ఆర్బీఐ న్యాయస్థానానికి స్పష్టం చేసింది. ఇక ఈ వివరణను సరిగా అర్థం చేసుకోని కొందరు గూగుల్ పేను ఆర్బీఐ నిషేధించిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.