‘సలార్’ టైటిల్.. హీరోగా ప్రభాస్.. వివరాలు చెప్పిన ప్రశాంత్ నీల్

ప్రభాస్ హీరోగా వరుస ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. వీటిలో నిన్న అధికారికంగా ప్రకటించిన ‘సలార్’ కూడా ఉంది. బాహుబలి తర్వాత ఇండియా మొత్తం క్రేజ్ తెచ్చుకున్న సినిమా కేజీఎఫ్ ను డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నిన్న విడుదల చేసిన అఫిషియల్ టీజర్ కూడా సినీ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. ప్రభాస్ రఫ్ లుక్, మిషన్ గన్, బ్యాక్ డ్రాప్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో సినిమా టైటిల్ ‘సలార్’ పై అందరిలో క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పుడు దీనిపై దర్శకుడు ప్రశాంత్ నీల్ వివరణ ఇచ్చారు.

prasanth neel about salaar title
prasanth neel about salaar title

‘ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సలార్ పై చర్చ జరగడం సంతోషంగా ఉంది. ఎందరో చాలా అర్ధాలు చెప్పుకున్నారు. సలార్ అనేది మామూలు పదం. దీనికి అర్ధం అంటే.. కమాండర్ ఇన్ చీఫ్, రాజుకు కుడి భుజం.. ఒక జనరల్ అనే అర్ధం ఇస్తాను. సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఇదే తరహాలో ఉంటుంది. చాలా శక్తివంతమైన పాత్ర. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ కలర్ కూడా కావాలనే డిజైన్ చేసింది. సినిమా నేపథ్యాన్ని చెప్పేదే. ఫస్ట్ లుక్ తోనే సినిమా గురించి ఒక అభిప్రాయం తీసుకురావాలనేది నా ఆలోచన. ప్రభాస్ లుక్ ప్రకారం తను ఆర్మీ వ్యక్తి అనుకోవాలనే టైటిల్ తో పోస్టర్, కింద క్యాప్షన్ కూడా ఇచ్చాం’ అని చెప్పుకొచ్చాడు.

ప్రభాస్ నే హీరోగా ఈ సినిమాకు తీసుకోవడంపై కారణం కూడా చెప్పుకొచ్చాడు. ‘ప్రభాస్ లో నేను రాసుకున్న కథకు హీరో కనపడుతున్నాడు. ప్రభాస్ మొహంలో అమాయకత్వం ఉంటుంది. దానిని స్క్రీన్ పై భారీ స్థాయిలో ప్రెజెంట్ చేయొచ్చు. అందుకే ప్రభాస్ ను ఎంచుకున్నాను. బలమైన విలనిజంకు సరైన హీరో అనిపించింది. అందుకే ప్రభాస్ ను ఎంచుకున్నాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా అనౌన్స్ మెంట్ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మరోవైపు ఈ సినిమాను ప్రభాస్ బిజీ షెడ్యూల్స్ మధ్యలోనే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.