మన పెద్దలు ఆహారాన్ని అన్నపూర్ణగా అభివర్ణిస్తుంటారు. పండగలు,పెళ్లిళ్లు, ఇలా ప్రతి శుభకార్యంలో రకరకాల పదార్ధాల తో తయారు చేసే తియ్యని పిండి వంటలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
మరి మన తెలుగు సంప్రదాయాలలో అంతటి ప్రాముఖ్యత ఉన్న ఆహారం విషయంలో రెండు పదార్థాల పేర్లు లో తికమక అయ్యి ఆ పదార్థాలను తప్పుగా సంబోధిస్తూ ఉంటారు. ఆ రెండు పదార్థాలు ఏవంటే ఒకటి జాంగ్రీ, ఇంకొకటి జిలేబి. ఈ రెండు చూడడానికే కాదు వీటిని తయారుచేసే విధానాలలో, రుచులలో కూడా చాల తేడాలు ఉంటాయి. అయినా కూడా ఈ రెండు పదార్ధాల విషయంలో చాలా మంది తికమక అవుతుంటారు.
ముందుగా జిలేబి ఇది బంగారపు రంగులో ఉండే తీపి వంటకం. ఇది దేశ వ్యాప్తంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. జిలేబిని పండుగలు మరియు శుభకార్యాల్లో తయారుచేస్తారు. దీన్ని మైదాతో తయారు చేస్తారు. జిలేబి చక్కర పాకంలో ముంచి తయారుచేసే కరకరలాడే తీపి వంటకం. ఇది గుండ్రని చుట్ల ని పోలి ఉంటుంది . జిలేబి పిండిని 6 నుంచి 8 గంటల పాటు పులియ బెడతారు. అందువల్ల జిలేబి కొంచెం పులుపు రుచిని కలిగి ఉంటుంది. ఇది ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.ఇది రోడ్డు మీద ఎక్కువగా దర్శనమిస్తుంటుంది.
ఇక రెండో ఐటెం ఆరెంజ్ రంగు లో ఉండే జాంగ్రీ ఇది ఎక్కువగా స్వీట్ షాప్స్ లో దర్శనమిస్తుంది. దీన్ని మినపప్పు రుబ్బిన తరువాత 3 గంటలు పులియనిచ్చి తయారుచేస్తారు. ఇది చూడడానికి పువ్వులాగా అనిపిస్తుంది.ఇక జాంగ్రీ,జిలేబి విషయంలో బాగా కన్ఫ్యూజ్ అయ్యేవారందరికీ ఈ విషయాన్ని తెలియచేయండి.