జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

Share

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు ప్రత్యర్ధులుగా ఉన్న ఆర్ జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహా కూటమితో జత కట్టారు. ఈ పార్టీలతో కలిసి సరికొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గాను సీఎం పదవి నుండి తప్పుకున్నారు నితీష్ కుమార్. మంగళవారం పట్నాలో గవర్నర్ షాగూ చౌహాన్ ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలందరి ఏకగ్రీవ సూచనల మేరకు ఇలా చేసినట్లు గవర్నర్ ను కలిసిన తర్వాత నితీష్ మీడియాకు తెలిపారు. రాజ్ భవన్ నుండి నేరుగా మాజీ సీఎం రబ్రీదేవి నివాసానికి వెళ్లిన నితీష్ కుమార్ .. తేజస్వి యాదవ్ సహా ఇతర ఆర్ జేడీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంలో 2017 లో ఏం జరిగిందో మర్చిపోదాం ఇప్పుడు సరికొత్త అధ్యాయాన్ని ప్రారంబిద్దాం అని తేజస్వి యాదవ్ తో అన్నట్లు సమాచారం. ఆ తర్వాత తేజస్వి యాదవ్ తో కలిసి నితీష్ కుమార్ రాజ్ భవన్ కు వెళ్లి ప్రభుత్వం ఏర్పాటునకు అవకాశం కల్పించాలని గవర్నర్ ను కోరారు. తమకు సంఖ్యాబలం ఉందని పేర్కొంటూ అందుకు సంబంధించిన పత్రాన్ని సమర్పించారు. ఏడు పార్టీల సభ్యులు, స్వతంత్రులతో కలిపి తమకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు.

 

ఈ సందర్భంలో తేజస్వి యాదవ్ బీజేపీ పై తీవ్ర విమర్శలు చేశారు. హిందీ బెల్ట్ లో బీజేపీ మిత్ర పక్షం ఏదీ లేదన్నారు. పొత్తు పెట్టుకున్న ప్రతి పార్టీని బీజేపీ దెబ్బతీస్తుందని చరిత్ర చెబుతోందన్నారు. పంజాబ్. మహారాష్ట్ర లోనూ అదే జరిగిందన్నారు. బీజేపీ అజెంండా బీహార్ లో అమలు కాకూడదన్నదే తామందరి అభిమతం అని తేల్చి చెప్పారు. నాడు అద్వానీ రధాన్ని లాలూజీ నిలువరించిన విషయం అందరికీ తెలుసునని గుర్తు చేస్తూ పశ్చాత్తప పడే పనులు తాము చేయడం లేదని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వంలో నితీష్ కుమార్ కు సీఎం పదవి, తేజస్వి యాదవ్ కి డిప్యూటి సీఎం పదవి, స్పీకర్ పదవి ఆర్ జేడీకి ఇచ్చే విధంగా సూత్రప్రాయ ఒప్పదం కుదిరినట్లు తెలుస్తొంది.

 

బీజేపీకి నితీష్ కుమార్ షాక్ ఇవ్వడం ఇది రెండో సారి. గతంలో ఎన్డీఏను వీడి ఆర్ జేడీతో జత కట్టారు. మళ్లీ 2017 లో ఆర్ జేడీని మధ్య లోనే వదిలేసి బీజేపీ చెంతకు చేరారు. ఇప్పుడు మరల బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చి మహకూటమితో జత కట్టారు నితీష్ కుమార్. ఈ పరిణామాలపై బీజేపీ బీహార్ అధ్యక్షుడు సంజయ్ జయస్ వాల్ స్పందిస్తూ నితీష్ కుమార్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అవకాశ వాదిగా అభివర్ణించారు. గత ఎన్నికల్లో ఎన్ డీ ఏ పేరుతో బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేశామనీ, తమ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినా నితీష్ కుమార్ నే ముఖ్యమంత్రిని చేశామన్నారు. ఇప్పుడు ఇలా చేయడం బీహార్ ప్రజలను, బీజేపీని మోసం చేయడమేనని ఆయన అన్నారు.

 


Share

Related posts

సీఎం కెసీఆర్ ప్రాజెక్టుల సందర్శన

somaraju sharma

అయోధ్య రామమందిరం భూమి పూజకు ముహూర్తం ఖరారు..ఎప్పుడంటే..??

somaraju sharma

బిగ్ బాస్ ఫోర్: ఆ కంటెస్టెంట్ కి ఇక నుండి సపోర్ట్ చేయాలనుకుంటున్నా పవన్ ఫ్యాన్స్ ..!!

sekhar