2019 అత్యుత్తమం పోలవరం ప్రాజెక్టు

2019 సంవత్సరానికి పోలవరం ప్రాజెక్టును అత్యుత్తమ ప్రాజెక్టుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ)గుర్తించింది. ఈ మేరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సీబీఐపీ అవార్డు పోలవరం కైవసం చేసుకుంది. పోలవరం ప్రాజెక్టులో అవినీతి, కాంట్రాక్టర్లకు అధిక చెల్లింపులు అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను పూర్వపక్షం చేస్తూ ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ భేష్ అని కితాబిస్తూ సీీబీఐపీ అవార్డుకు పోలవరం ప్రాజెక్టు ఎంపికైంది. ఆ విషయాన్ని సీీబీఐపీ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపారు.

వచ్చే ఏడాది జనవరి 4న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లేదా ప్రధాని నరేంద్రమోడీ ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డు పై స్పందించిన మంత్రి దేవినేని ఉమ…పడిన కష్టానికి ఫలితం దక్కిందని వ్యాఖ్యానించారు. పోలవరం పనులు భేషుగ్గా ఉన్నాయని నిన్న పార్లమెంటులో కేంద్ర మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. నిర్మాణ వేగం విషయంలో కాంట్రాక్టర్లు అధిక చెల్లింపులు జరిగినప్పటికీ వాటిని రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసిందని కూడా ఆయన సభకు వివరించారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు దక్కడంతో ఆ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను మీరిందనీ, అవినీతినిక పాల్పడిందంటూ వస్తున్న విమర్శలకు తెరపడే అవకాశం ఉంది.