ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న సినిమాల్లో చాలావరకు పాన్ ఇండియా మూవీల లాగే వస్తున్నాయి. ప్రతీ దర్శకుడు జాతీయ స్థాయిలో ప్రేక్షకుల మెప్పుపొందాలని తహతహలాడుతున్నాడు. అలాంటి సినిమాల్లో నటించడానికి హీరోలు అమితాసక్తి కనబరుస్తున్నారు. బాహుబలితో ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ తరువాత ట్రిపుల్ ఆర్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్ సైతం పాన్ ఇండియా స్టార్స్‌గా అవతారమెత్తారు. మరి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి? ఈ హీరో అసలు పాన్ ఇండియా హీరో అనే కీర్తిని గడించాడా?
తగ్గేదేలే అన్న బన్నీ
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ బద్దలు కొట్టి పాన్ ఇండియా స్టార్స్‌లో ఒకడిగా నిలిచాడు. అయితే ఇప్పటివరకు రాజమౌళి డైరెక్షన్లో నటించిన టాలీవుడ్ హీరోలు మాత్రమే పాన్ ఇండియా స్టార్ అయ్యారు. కానీ రాజమౌళి డైరెక్ట్ చేయని సినిమాతో బన్నీ ఆ ఘనతను సాధించాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం మన దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ‘నీ యవ్వ, తగ్గేదేలే’ అంటూ అతను ఊర మాస్ వాయిస్ లో చెప్పిన డైలాగ్స్ థియేటర్లలో ప్రేక్షకుల చేత ఈలలు కొట్టించాయి. సినిమా రిలీజ్ అయి చాలా కాలం అవుతున్నా ఈ డైలాగ్ ఇప్పటికీ చాలా మంది నోట వినిపిస్తోంది. అంతలా సినిమా ప్రజలను ఆకట్టుకుంది. పుష్ప సినిమా చూసిన ప్రేక్షకులు పుష్ప-2 సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది కూడా సంచలన విజయం నమోదు చేయవచ్చు. దాంతో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్స్ కొట్టిన టాలీవుడ్ హీరోగా బన్నీ రికార్డు సృష్టించవచ్చు.
2020 అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బన్నీ 2021లో పుష్ప సినిమా తో బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు. ఇలా వరుసగా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అలాగే కొద్ది నెలల్లో రిలీజ్ అయ్యే పుష్ప పార్ట్-2తో కూడా హిట్ కొట్టొచ్చు. బన్నీ అభిమానులు ఈ విషయాలన్నీ సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తూ అల్లు అర్జున్యే అసలైన పాన్ ఇండియా స్టార్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు.