(న్యూస్ అర్బిట్ డెస్క్)
మన నగరాల్లో బయటకు వెళ్లాలంటే ట్రాఫిక్ భయం వెన్నాడుతుంది. ఇంకా పెద్ద నగరాలైన న్యూయార్క్, లండన్ వంటి చోట్ల ట్రాఫిక్ కష్టాలు ఇంకెంత భయంకరమో అనుకుంటాం. కానీ కాదు. మంచి సంగతులలో ఏమో గానీ అస్తవ్యస్తమైన ట్రాఫిక్ విషయంలో మాత్రం మన తర్వాతే ఎవరైనా. భయంకరమైన ట్రాఫిక్ రద్దీ ఉండే మొదటి పది ప్రపంచ నగరాలలో నాలుగు ఇండియాలోనే ఉన్నాయి.
వాటిల్లో బెంగళూరు మొదటి స్థానం ఆక్రమించింది. తర్వాత ముంబై (4వ స్థానం), పూనే (5వ స్థానం), న్యూఢిల్లీ (8వ స్థానం) ట్రాఫిక్ కష్టాల విషయంలో పోటీ పడుతున్నాయి. మొదటి పది స్థానాలలో ఉన్న ఇతర నగరాలు మనీలా (ఫిలిప్పీన్స్), బొగోటా (కొలంబియా), మాస్కో (రష్యా), లిమా (పెరూ), ఇస్తాంబుల్ (టర్కీ), జకార్తా (ఇండొనేసియా).
లొకేషన్ టెక్నాలజీ సంస్థ టాంటాం తాజా అధ్యయనం తర్వాత 2019 టాంటాం ట్రాఫిక్ ఇండెక్స్ పేరుతో ఈ వివరాలు విడుదల చేసింది. 57 దేశాలలోని 416 నగరాలలో ట్రాఫిక్‌ను పరిశీలించి ఈ రేటింగులు ఇచ్చింది. దీని ప్రకారం బెంగళూరు రోడ్లపై రద్దీ సమయాల్లో వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ కారణంగా సంవత్సరానికి 243 గంటలు అదనంగా రోడ్లపై గడిపారు. అదే ముంబైలో అయితే 209 గంటలు ఎక్కువగా గడిపారు.