చైనీయుల మెడపై ‘సోషల్ క్రెడిట్’ కత్తి!

Photo credit: The Independent

బీజింగ్: చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తెచ్చిన ‘సోషల్ క్రెడిట్’ సిస్టమ్ ఇప్పుడు ఆ దేశ ప్రజలకు గుదిబండలా తయారైంది. చట్టాలను ఉల్లంఘించినా.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, బిల్లులు కట్టకపోయినా.. ‘సోషల్ క్రెడిట్’లో వారి పాయింట్లు తగ్గిపోతాయి. ఫలితంగా వారికి విచిత్రమైన శిక్షలు ఎదురవుతాయి. విమాన, రైలు ప్రయాణాలు చేయటానికి టికెట్లు కొనుక్కోలేరు. ఇలా గత సంవత్సరం ఏకంగా 17.5మిలియన్ల ప్రజలు విమానయానం చేయలేకపోయారు.

5.5మిలియన్ల మందిని రైలు ప్రయాణం చేయకుండా నిలువరిచినట్లు నేషనల్ పబ్లిక్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ తెలిపింది. అంతేగాక, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించని కారణంగా 128మందిని చైనా దాటేందుకు అనుమతివ్వలేదు. అయితే, వేగంగా మారుతున్న సమాజంలో ‘సోషల్ క్రెడిట్’ విధానం ప్రజల్లో క్రమశిక్షణను పెంచుతోందని చైనా అధికార పార్టీ వర్గాలు చెబుతుండటం గమనార్హం.

మూడు దశాబ్దాల్లో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఎన్నో మార్పులు తీసుకొచ్చాయని, మార్కెట్లో మోసాలను, నకిలీ ఉత్పత్తులను అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. సోషల్ క్రెడిట్ సిస్టమ్ చైనా అధ్యక్షడు జీ జిన్‌పింగ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ అని.. డేటా ప్రాసెసింగ్, జనటిక్ సీక్వెన్సింగ్, ఫేసియల్ రికగ్నిషన్ వరకు సాంకేతికతను వాడుతున్నట్లు వెల్లడించాయి. ఈ విధానం ద్వారా మోసాలను, ఎగవేతలను కట్టడి చేయగలుగుతామని చెప్పాయి. కాగా, ఇందుకోసం చైనా ప్రభుత్వం భారీ మొత్తాన్ని వెచ్చిస్తోంది.

2014 నుంచి సోషల్ క్రికెట్ సిస్టమ్‌ను చైనాలో అమలు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. చట్టాలను ఉల్లంఘించినా, పన్నులు చెల్లించకపోయినా.. కొన్ని ప్రాంతాల్లో కుక్కలను వాకింగ్ తీసుకొచ్చినప్పుడు వాటికి పట్టీ కట్టకపోయినా పాయింట్లు తగ్గిస్తామని వెల్లడించాయి. కాగా, మానవ జీవితాలను ప్రతి విభాగంలో ఇలా నియంత్రించడం సరికాదని అమెరికా వైస్ ప్రెసిడెంట్ మైక్ పిన్స్ చైనా విధానాన్ని విమర్శించారు.

ప్రపంచం నలువైపుల నుంచి విమర్శలు వచ్చిన కూడా చైనా మాత్రం సోషల్ క్రెడిట్ సిస్టమ్‌ను కొనసాగించాలని నిర్ణయించింది. 2020 వరకు ఈ విధానాన్ని చైనా మొత్తం వ్యాప్తి చేసేందుకు సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించింది. ప్రయాణాలు, వ్యాపారాలు, విద్యా అవకాశాలపై ఈ సోషల్ క్రెడిట్ ప్రభావం చూపుతుంది. ‘మీరు ఒక్కసారి నిజాయితీని కోల్పోయినట్లైతే.. అంతటా ఆంక్షలను ఎదుర్కొవాల్సిందే’ అని చైనా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

సోషల్ క్రెడిట్ విధానంలో నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడం, ప్రభుత్వం నుంచి వచ్చే కాంట్రాక్టులను రద్దు చేయడం, బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. సోషల్ క్రెడిట్ సిస్టమ్‌లో కొత్త అంశాలను చేరుస్తూ పోతున్నారు. గత ఏడాది పన్నులు చెల్లించకుంటే ఆంక్షలు విధించగా.. ఇప్పుడు మోసపూరిత ప్రకటనలు, డ్రగ్ సేఫ్టీ రూల్స్ పాటించకపోవడం లాంటి అంశాలను కూడా చేర్చినట్లు ప్రభుత్వ సమాచారం కేంద్రం వెల్లడించింది. అయితే, సోషల్ క్రెడిట్ సిస్టమ్ ఏయే ప్రాంతాల్లో అమలవుతుందో స్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం.

పెరిగిన కంప్యూటర్ సాంకేతికత, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఇతర టెక్నాలజీ మార్గాలను ఉపయోగించి చైనా ప్రజలను తమ నియంత్రణలో ఉంచుకునేలా ‘సోషల్ క్రెడిట్’సిస్టమ్‌ను అక్కడి అధికార పార్టీ ఉపయోగించుకుంటోంది. ఇది ఇలా ఉండగా, వ్యక్తులపై నిఘా పెట్టేందుకు 2000 సంవత్సరంలో పోలీస్ మినిస్ట్రీ ‘గోల్డెన్ షీల్డ్’ అనే వ్యవస్థను ప్రారంభించింది.

ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ కోసం అధికార పార్టీ భారీ మొత్తంలో ఖర్చు చేస్తోంది. కాగా, ముస్లింలు, ఇతర ఎథ్నిక్ మైనార్టీ ప్రజలు ఉండే ప్రాంతాల్లో జనటిక్ డేటా బేస్ కోసం వారి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటున్నారని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. ఇది ఇలా ఉంటే.. జింజియాంగ్ ప్రాంతంలోని పదిలక్షల ఉగుర్స్, కజక్స్, ఇతర ముస్లిం మైనార్టీ ప్రజలను పొలిటికల్ ఎడ్యుకేషన్ క్యాంపుల్లో నిర్బంధించారని అమెరికా అధికారులు, ఐక్యరాజ్యసమితి నిపుణులు పేర్కొన్నారు. అయితే, తీవ్రవాద భావాలను తగ్గించేందుకు వారికి ఈ క్యాంపుల్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చైనా ప్రభుత్వం చెబుతోంది.