విభజనపై సుప్రీం లో హౌస్ మోషన్ పిటిషన్

ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ లాయర్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. ఎటువంటివ సూచనలూ, ముందస్తు సమాచారం లేకుండానే ఉమ్మడి హైకోర్టును విభజించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడానికి నిర్ణయించింది. ఈ రోజు సమావేశమైన ఏపీ లాయర్ల సంఘం సర్వసభ్య సమావేశం హాట్ హాట్ గా జరిగింది.

తగినంత సమయం కూడా ఇవ్వకుండా విభజన జరిగిపోయింది…మీరెళ్లిపోవాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేయడంపై సమావేశంలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్రదింపులు, సలహాలూ,సూచనలూ లేకుండా ఉన్నట్లుండి విభజన చేయడం…ఆ వెంటనే మూడు రోజుల గడువులోగా ఏపీ హైకోర్టు ఇక్కడ కాదు అని పంపించేయడం ఎంతమాత్రం సమంసజం కాదని సమావేశం అభిప్రాయపడింది. హైకోర్టు విభజనకు తాము వ్యతిరేకం కాదనీ, కానీ సంప్రదింపులు లేకుండా విభజించేయడం, సమయం ఇవ్వకుండా పంపించేయడాన్నే తాము అభ్యంతరం చెబుతున్నామని సమావేశం పేర్కొంది.