షారుక్‌‌కు డాక్టరేట్ వినతి తిరస్కరణ

బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌కు గౌరవ డాక్టరేట్‌ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ జామియా మిల్లియా ఇస్లామియా (జేఎమ్‌ఐ) విశ్వవిద్యాలయం చేసుకున్న వినతిని కేంద్ర మానవ వనరుల శాఖ (హెచ్‌ఆర్‌డి) తిరస్కరించినది. షారుఖ్ ఖాన్ ఇప్పటికే మరో విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నందువల్ల అతనికి మరో డాక్టరేట్ ఇవ్వనక్కర్లేదని మంత్రిత్వశాఖ తన వివరణలో తెలిపినది.

గతంలో షారుక్‌ జేఎమ్‌ఐ విశ్వవిద్యాలయం మాస్‌ కమ్యూనికేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో విద్యనభ్యసించారు. పూర్తి హాజరు లేదనే కారణంతో ఆయన చివరి సంవత్సరంలో తుది పరీక్షలు రాయలేదు. నటుడిగా పేరు ప్రఖ్యాతలు స్పందించిన షారుఖ్ తమ విద్యార్థి కావటంతో జేఎమ్‌ఐ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించాలనుకున్నది. షారుఖ్ సమ్మతి కోసం జేఎమ్‌ఐ లేఖ రాసినది. షారుఖ్ అంగీకరించారు.

ఈ నేపథ్యంలో గత ఏడాది జేఎమ్‌ఐ ఆయన అంగీకారాన్ని జతచేస్తూ కేంద్ర మానవ వనరులశాఖకు వినతిని పంపినది. జేఎమ్‌ఐ వినతిని హెచ్‌ఆర్‌డి తిరస్కరించినది. ‘2016లో ఆయన మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందారని తెలిసింది. ఒక వ్యక్తి పలు మార్లు గౌరవ డాక్టరేట్‌ పొందకూడదనే కచ్చితమైన నిబంధనలు లేవని, కానీ ఇలా చేయడం ప్రోత్సహించదగ్గది కాదు’ అని అధికారులు పేర్కొన్నారు.