టాలీవుడ్ నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు శ్రీకాళహస్తిలో జరిగాయి. ఈ సినిమాకు ‘కన్నప్ప’ అనే టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు హిందీలో మహాభారతం సిరీస్ రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అవా ఎంటర్ టైనర్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మోహన్ బాబు ‘కన్నప్ప’ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు సరసన బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ నటిస్తున్నారు.

అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇది: విష్ణు
శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత హీరో మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. కన్నప్ప సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి సినిమాను రూపొందిస్తున్నామని అన్నారు. దీని బడ్జెట్ సుమారు రూ.60 కోట్లు ఉంటుందని అంచనా. శివ భక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని మంచు విష్ణు అన్నారు. కన్నప్ప భక్తిని ఈ సినిమాలో చూడబోతున్నారని చెప్పారు. అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుందన్నారు. త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని పేర్కొన్నారు.
కన్నప్ప సినిమాలో చిత్ర పరిశ్రమలో ఉన్న గొప్ప గొప్ప నటీనటులు ఇందులో నటించనున్నారని హీరో మంచు విష్ణు తెలిపారు. సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ సినిమాలో పరుచూరి గోపాలకృష్ణ, తోట ప్రసాద్, బుర్ర సాయి మాధవ్ కథను అందించారు. ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు.

‘విష్ణు’ సినిమాతో ఆరంగేట్రం..
1985లో మంచు విష్ణు ‘రగిలే గుండెలు’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించాడు. ఆ తర్వాత 2003లో తెలుగు యాక్షన్ చిత్రం ‘విష్ణు’ సినిమాలో నటించారు. ఈ సినిమాకు మంచు విష్ణుకు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ‘సూర్యం, రాజకీయ రౌడీ, అస్త్రం, గేమ్, ఢీ, కృష్ణార్జున, సలీమ్, వస్తాడు నా రాజు, దేనికైనా రెడీ, దూసుకెళ్తాడు, పాండవులు పాండవులు తుమ్మెద, రౌడీ, అనుక్షణం, డైనమైట్, ఆచారి అమెరికా ప్రయాణం’ వంటి సినిమాల్లో హీరోగా నటించారు.

రీసెంట్ మూవీ ‘జిన్నా’కు అనూహ్య స్పందన..
మంచు విష్ణు హిట్ కొట్టి ఎన్నో ఏళ్లు అవుతుంది. తాను హీరోగా నటించిన రీసెంట్ చిత్రం ‘జిన్నా’. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్‌లోనే విడుదలైంది. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీగా థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైనా ఏ ఒక్క చోటు కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. ఈ సినిమాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా ఎక్కవగానే జరిగాయి. అయితే థియేటర్లలో మెప్పించకపోయినా ఓటీటీ వేదికపై మంచి రెస్పాన్స్ అందుకుంది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా అనూహ్య స్పందన దక్కించుకుంది. అమెజాన్ టాప్ ట్రెండింగ్‌లో ‘జిన్నా’ సినిమా నిలిచింది.

‘కన్నప్ప’తో పాన్ ఇండియాలో మెప్పిస్తాడా?
టాలీవుడ్‌లో చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న వారిలో ‘మంచు విష్ణు’ ఒకరు. ఇప్పటివరకు ఆయన నటించిన ఏ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మెప్పించలేకపోయాయి. జిన్నా సినిమా పాన్ ఇండియా లెవల్‌లో విడుదలైనప్పటికీ నెగిటివ్ టాక్ దక్కించుకుంది. ఇప్పుడు ‘కన్నప్ప’ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మంచు విష్ణు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మెప్పిస్తుందా? లేదా? అనేది మూవీ విడుదలైనప్పుడే తెలుస్తుంది.