తెలంగాణ ప్రభుత్వంపై సంజయ్ సంచలన వ్యాఖ్యలు

 

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచార సభలో నేతల మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పాతబస్తీలో పాకిస్థానీయులు, రోహింగ్యాలు ఉన్నారని, పాతబస్తీ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ నేడు తాజాగా తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయి అంటూ మరో బాంబు పేల్చారు.

 

జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఎవరు కూల్చేయరు కానీ దానంతట అదే కూలిపోతుంది రాసి పెట్టుకోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి. కేసీఆర్ అవినీతి ప్రభుత్వం కుప్పకూలుతుంది అని అన్నారు. కేంద్రం అన్ని లెక్కలు తెలుస్తుందని అన్నారు. అమిత్ షా వస్తున్నారు, టిఆర్ఎస్ జాగ్రత్త అంటూ బండి హెచ్చరించారు. బిజెపి అధికారం కోసం చూడటం లేదని, పేదలకు న్యాయం చేసేందుకే అధికారంలోకి వస్తామని అన్నారు. నిత్యం ఎన్నికల సభలో బండి చేస్తున్న వ్యాఖ్యలకు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇస్తున్నారు. అదేవిధంగా ఎంఐఎం నేతలు బండి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పుడు తాజాగా బండి సంజయ్ చేసిన మధ్యంతర ఎన్నికల వ్యాఖ్యలపై అధికార టీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.