ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు రెడీ అయిన ఈ నియోజకవర్గం ఇంచా ర్జ్ యార్లగడ్డ వెంకట్రావు గేర్ మార్చారు. అందరినీ కలుస్తున్నారు. ఎవరి సమస్యలు ఎలా ఉన్నా.. ఆసాంతం వింటున్నారు. వాటిని పరిష్కరించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు.అదేసమయంలో అన్ని కులాలు, మతాల వారిని కూడా కలుస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. దీంతో నియోజకవర్గంలో యార్లగడ్డ దూకుడు మామూలుగా లేదుగా! అనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో ఆయన తన ఉదారతను ప్రదర్శిస్తున్నారు.
గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలోని రెండు ఆలయాలకు యార్లగడ్డ వెంకట్రావు మూడు లక్షల రూపాయల నగదు విరాళంగా అందజేశారు. గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఆయన సొమ్ము అందించా రు. అంతేకాదు.. ఈ ఆలయ అభివృద్ధికి రెండు లక్షల రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. అంతేకాదు.. స్థానికంగా ఉన్న మరో ఆలయం శ్రీసీతారామాలయానికి వెళ్లిన ఆయన ఆలయ అభివృద్ధి పనుల కోసం లక్ష రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. రెండు చోట్ల ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు యార్లగడ్డను ప్రశంసించారు.
అయితే.. ఇక్కడితో అయిపోలేదు.. గతంలో తాము తమ సమస్యలు చెప్పుకొన్నా వంశీ పట్టించుకోలేదని బాహాటంగానే చెప్పు కొచ్చారు. ఎమ్మెల్యే కాకపోయినా.. చేసిన సాయం మరువలేమన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ వంతు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక, నియోజకవర్గంలోని చర్చిలకు కూడా యార్లగడ్డ వెళ్తున్నారు. వారికి కూడా ఆర్థిక సాయం అందిస్తున్నారు. స్థానిక ఓ చర్చికి 2 లక్షలు, మరో చర్చికి రూ. లక్ష చొప్పున ఆయన సాయం చేశారు. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఇదే టాక్ వినిపించింది. గతంలోనే నూతన చర్చి కట్టుకునేందుకు ప్రయత్నించామని.. కానీ, ఎమ్మెల్యే సాయం చేస్తామని కూడా చేయలేదని ఇక్కడి వారు చెప్పడం గమనార్హం.
మరోవైపు.. ముస్లిం సోదరులను కూడా యార్లగడ్డ కలుస్తున్నారు. తనకు అండగా ఉండాలని కోరుతున్నారు. వారి సమస్యలు కూడా వింటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రబుత్వం గెలిస్తే.. రంజాన్ తోఫా, ముబారక్ , వంటి పథకాలు తిరిగి వస్తాయని చెబుతున్నారు. దీనికి వారి నుంచి సానుకూల స్పందన వస్తుండడం గమనార్హం. ఇదిలావుంటే.. గన్నవరంలో రెండు కీలక ప్రాంతాలైన బస్టాండ్, గన్నవరం జంక్షన్లలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు యార్లగడ్డ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి విదాలు రాకుండా చూసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే.. సిట్టింగ్ నేత కంటే.. కూడా యార్లగడ్డ పనితీరు మంచిగా ఉందనే అభిప్రాయం కలుగుతుండడం గమనార్హం.