ఇప్పుడు నీకు ఏదశ నడుస్తోంది అడిగింది మా అమ్మాయి
ఏమోనే నేనెప్పుడూ పట్టించుకోలేదు
దానికి ఇప్పుడు అర్ధాష్టమ శని నడుస్తోంది మృత్యుంజయ జపం చేయమని చెప్పేను వింటేనా అంది మాఅమ్మ
ఎప్పుడూ ఎదో ఒకటి వస్తూనే ఉంది అంది తనే మళ్ళి
అమ్మా జబ్బుచేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాము జ్యోతిష్యుడి దగ్గరికి కాదు
గ్రహశాంతి అంటే ఏవిటి గ్రహానికి లంచం ఇవ్వడం అంతేనా
అంటే ఈ లంచం గ్రహాలదగ్గరే ప్రారంభం అయిదన్నమాట
పిల్ల పుడితే నక్షత్రం మంచిదికాదు గ్రహశాంతి చెయ్యాలి
మనిషి ఛస్తే వారం మంచిదికాదు గ్రహశాంతి చెయ్యాలి
ఒక్కొక్కసారి ఆ యిల్లు కొన్నాళ్ళకి వదిలెయ్యాలి
ఉన్నట్టుండి ఎక్కడికి పోతారు
టెక్నాలజీ పెరిగింది
వైద్యం అభివృద్ధి చెందింది
అన్నీ మారేయి మారనివి శాస్త్రాలు మూఢ నమ్మకాలు
ఇంట్లో ప్రాణం పోతే అరిష్టం
పలెటూళ్లలో వీధిలో పడేస్తారు
చుట్టూ తడకలు కడతారు
ఇప్పుడు ఆస్పత్రిలో పడేస్తున్నారు
చచ్చిపోయేక ఇంటికి తీసికెళ్ళినా ఇంట్లో పెట్టరు
సెల్లార్లో పడేస్తారు
మరికొంతమంది అటునుంచి ఆటే తీసికెళ్తారు
అంతవరకూ మన మధ్య ఉన్నవాడు చావగానే అరిష్టం ఐపోయేడా
చచ్చిపోయినవాడు దేవుడితో సమానం అంటారే
మరి దేవుడు అంటరానివాడా
శాస్త్రాన్ని కాదంటే ఏమవుతుందోనన్న భయం
ఆస్పత్రిలో ఎంతోమంది చచ్చిపోతారు మరి అక్కడ ఈ శాస్త్రం వర్తించదా
అసలు చావుకి నక్షత్రానికి ఏవిటి సంబంధం
ఉన్నవి ఇరవైఏడు నక్షత్రాలు.. పాపం మనవే వాటికీ మంచి చెడు నిర్ణయించేసేము
పైగా ధనిష్ఠాపంచకాలు
అన్నీ ఒకెత్తు ఆ తరవాత ఒకెత్తు
అంత్యక్రియలు మొదలు పన్నెండు రోజులు ఆ బ్రాహ్మడు నిన్ను తినేస్తాడు పూర్తి క్షవరం చేస్తాడు
గోదానం భూదానం సువర్ణదానం.. అవి ఎందుకో ఎవరికి తెలీదు
చచ్చినవాడి ఆత్మ గోవు తోక పట్టుకొని వైతరిణి ఈదుతుందిట
అసలు ఆత్మకి శరీరం ఉండదుకదా గాలిలో వెళ్లేలేదా
ఇంకా రసవత్తరం ఉంది
కొడుక్కి ఒడుగు చెయ్యకపోతే కర్మ చెయ్యడానికి పనికిరాడు
అందుకే పూర్వం తొమ్మిది ఏళ్లకే ఒడుగు చేసేవారు
ఐతే ఇప్పుడు ఖర్చులు కలిసొస్తాయని పెళ్ళికి ఓరోజు ముందు చేస్తున్నారు
ఈ శాస్త్రాలు ఆచారాలు యెంత అసందర్భంగా ఉన్నాయో చెప్పడానికి
ఓ చిన్న ఉదాహరణ
నాకళ్ళ ముందే జరిగింది
ఒకాయన పోయేడు అతనికి ఓ కొడుకు ఉన్నాడు పెద్దవాడే కానీ ఒడుగు అవలేదు
కర్మ చెయ్యడానికి పనికిరాడు మరెలా
ఉన్న ఒక్క కొడుకు చెయ్యకపోతే ఎలా అంది అతని భార్య
కాన్స్టిట్యూషన్కి ఉన్నట్టే శాస్త్రాలకు ఎమెండ్మెంట్లు ఉంటాయి
తమాషా ఆ బ్రాహ్మడు కుర్రాడిని కూర్చోపెట్టి నాలుగు దర్భలు కట్టి మమ అనిపించించి జంధ్యం వేసెడు
ఎక్కడా శవం పక్కన
అపరకర్మలు చేసేవాళ్ళు శుభకార్యాలు చేయించరు వాటికీ వేరే ఉంటారు
మరి ఒడుగు శుభకార్యం ఇతను ఎలా చేసేడు
తండ్రి పోయేడు కాబట్టి కొడుకుకి మైల ఓ ఏడాది వరకు శుభకార్యం చెయ్యకూడదు
మరి ఇప్పుడు ఎలా చేసేడు
చుట్టూ సనాతనపరులు ఎంతోమంది ఉన్నారు
ఎవరు మాట్లాడలేదు
నేను అక్కడే ఉన్నాను అడుగుదాం అనుకున్నాను కానీ సమయం కాదు
శాస్త్రం మనం చెప్పినట్టే వింటుంది
ఎవరికి అనుకులంగా వాళ్ళు వాడుకుంటారు అంతే
ప్రాణం అందరిదీ ఒకటే
జంతువులకి ఆత్మలు ఉండవా
శాస్త్రాలు వాటికి వర్తించవా
వాటి ఆత్మలు క్షోభించినా పర్వాలేదా
ఇవన్నీ మనం పనిలేక పెట్టుకున్నవే
చేస్తే లాభమూ లేదు
చెయ్యకపోతే నష్టమూ లేదు
బతికున్నవాళ్ళ ఆత్మ బాధ పడకుండా ఉంటె చాలు
ఆలోచించండి మరి
బీనాదేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ