CBI Cases: సీబీఐ నమ్మకం కోల్పోతుందా..!? జూలైలో చేతులెత్తేసిన దర్యాప్తు సంస్థ..!!

CBI Cases: Political Pressures Defeating CBI Powers
Share

CBI Cases: జిల్లా కోర్టు నుండి రాష్ట్ర హైకోర్టు వరకు.. హైకోర్టు నుండి సుప్రీమ్ కోర్టు వరకు మన దేశంలో ఎక్కువగా నమ్మే దర్యాప్తు సంస్థ అంటే సీబీఐ మాత్రమే..! దేశంలో అత్యున్నత ఛేదన సంస్థగా సీబీఐకి పేరుంది. ఆర్ధిక నేరాలైనా.., మోసాలైనా.., హత్యలైనా.., రాజకీయ కుంభకోణాలైనా సీబీఐ రంగంలోకి దిగితే తేలిపోతుంది అనే నమ్మకం ఉండేది.. కానీ కాలక్రమేణ దేశంలో ఈ సంస్థ విలువ కోల్పోతున్న భావన కలుగుతుంది. నాడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, నేడు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సీబీఐపై ఇదే తరహా అభిప్రాయాలు వ్యక్తమవుతుండడం గమనార్హం..!

CBI Cases: ఈ అధికారులు పంజరంలో చిలుకలేనా..!?

దర్యాప్తు సంస్థలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి మన దేశంలో మంచి ప్రాముఖ్యత ఉంది. ఏ కేసుల్లో అయినా రాష్ట్ర ప్రభుత్వ పోలీసులపై నమ్మకం లేనప్పుడు, లేదా రాష్ట్ర పోలీసులు రాజకీయ ఒత్తిడులకు లొంగుతారు అనుకున్నప్పుడు హైకోర్టులు గానీ సుప్రీం కోర్టులు ఆ కేసులను సీబీఐకి అప్పగిస్తుంటాయి. కానీ దురదృష్టవశాత్తు కొన్ని ఏళ్లుగా సీబీఐ కూడా పాలకుల పంజరంలో చిలుకగా మారిపోయింది అన్న ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ విషయంలో గత కాంగ్రెస్ పాలన హయాంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నాయకులు, ఎంపిలు సీబీఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి కూడా గతంలో ఆయనపై సీబీఐ కేసులు నమోదు అయిన సమయంలో ఇదే విధంగా ఆ పార్టీ నేతలు సీబీఐని విమర్శించారు. ఇప్పుడు కూడా సీబీఐ అదే రకంగా పని చేస్తుంది అనడానికి కొన్ని ఉదాహరణలు కనబడుతున్నాయి.

CBI Cases: Political Pressures Defeating CBI Powers
CBI Cases: Political Pressures Defeating CBI Powers

జూలై నెలలోనే మన రాష్ట్రంలోని కొన్ని కేసులకు సంబంధించి సీబీఐ వ్యవహరిస్తున్న తీరు ఆ వాదనలకు బలం చేకూరుస్తోంది. ఏపిలో రాజకీయ ప్రాధాన్యత కల్గిన మూడు కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తుండగా అవి రాష్ట్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించదగిన కేసులు కావడం గమనార్హం. అందులో ఒకటి వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు దాఖలు చేసిన జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కు సంబంధించినది. రెండవది న్యాయమూర్తులపై వైసీపీ సోషల్ మీడియాలో ఆ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు, దుర్భాషలు చేసిన కేసు. ఈ రెండింటితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. ఈ కేసుల్లో సీబీఐ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లోనూ అనుమానాలు వ్యక్తం అయ్యే విధంగా ఉన్నాయి.

ఈ కేసుల్లో ఎందుకో తడబాటు..!?

జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో జులై నెలలోనే సీబీఐ అధికారుల తీరు కారణంగా ఆరు సార్లు విచారణ వాయిదా పడింది. మొదట జూలై 1 నుండి 8వ తేదీకి వాయిదా పడగా, ఆ తరువాత జూలై 14 కు, తరువాత జూలై 26కు మళ్లీ ఆగస్టు నాలుగు కు విచారణ వాయిదా పడింది. ఇలా విచారణ వాయిదా పడటానికి కారణం సీబీఐ. ఈ కేసులో మొదట సీబీఐ కౌంటర్ దాఖలు చేయలేదు. విచారణ అంశాన్ని తొలుత కోర్టుకు వదిలివేస్తున్నట్లు సీబీఐ చెప్పింది. తరువాత పిటిషనర్ రఘురామ కృష్ణంరాజు తరపున వాదనలు వినిపించి కౌంటర్ దాఖలు చేసిన తరువాత సీబీఐ కూడా వ్రాతపూర్వకంగా కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపి సమయం కోరింది సీబీఐ. వారి అభ్యర్థన మేరకు వాయిదా వేస్తే 26 నాటి వాయిదాకు సీబీఐ అధికారులకు జ్వరం వచ్చింది. ఆ కారణంగా వాదనలు వినిపించలేదు. కౌంటర్ దాఖలు చేయలేదు. ఈ పరిణామాలతో సీబీఐ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇక మరోక కేసు అయిన న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు విషయంలోనూ ఒకే ఒక ఎన్ఆర్ఐ రాజశేఖరరెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేసి సీబీఐ చేతులు దులుపుకుంది.

CBI Cases: Political Pressures Defeating CBI Powers
CBI Cases: Political Pressures Defeating CBI Powers

వివేకా హత్య కేసులో ముందుకు వెనక్కు..!?

మరో కేసు అయన వివేకానంద రెడ్డి హత్య కేసులోనూ సీబీఐ 90 శాతం దర్యాప్తు పూర్తి చేసి అక్కడ ఆగిపోయిందని చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ కేసులో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ కుమాద్ యాదవ్, నైట్ వాచ్ మెన్ రంగన్న, కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లా లను సీబీఐ ఇప్పుడు కొత్తగా విచారణ చేస్తున్నది ఏమీ లేదు. గతంలోనూ వీరినే అనుమానించింది, చాలా కాలం నుండి విచారణ చేస్తూనే ఉంది. కానీ ప్రధాన సూత్రదారులుగా, అనుమానితులుగా ఉన్నవారిని విచారిస్తున్న దాఖలాలు కనబడటం లేదు. వివేకా కుమార్తె అనుమానితులుగా ఇచ్చిన 14 మంది జాబితాలో కడప ఎంపి అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి తదితర ముఖ్యుల పేర్లు ఉన్నాయి. వీరందరినీ సీబీఐ పిలిపించి విచారించింది లేదు. కేవలం కింది స్థాయి వారినే పదేపదే పిలిపిస్తూ విచారణ చేస్తున్నది సీబీఐ. ఇలా కీలకమైన మూడు కేసుల్లో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు కొన్ని అనుమానాలకు తావు ఇస్తుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరో విషయం కూడా ఉంది. సీబీఐలో కేసుల సంఖ్య అధికంగా ఉంటుంది. దానికి తగినట్లుగా ఇన్వెస్టిగేషన్ చేయగలిగే అధికారులు, సిబ్బంది సంఖ్య లేకపోవడం ఒక కారణం కావచ్చు. మరో వైపు ఈ కేసుల కంటే ప్రాధాన్యత ఉన్న కేసులూ ఉండవచ్చు. రాజకీయ ఒత్తిడులే కారణం కావచ్చు, లేక కేంద్ర హోంశాఖ అధికారుల ఒత్తిడి కావచ్చు, లేక సిబ్బంది కొరత పని ఒత్తిడి, పని భారం కారణం కావచ్చు. కారణాలు ఏమైనా కాని జూలై నెలలో కీలకమైన మూడు కేసుల్లో సీబీఐ సాధించిన ప్రగతి శూన్యం అని చెప్పవచ్చు.


Share

Related posts

Mask: మాస్క్ ఫ్రీ జాబితాలోకి రెండో దేశం..!!

sekhar

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ

Special Bureau

NTR-Bharat Ratna: ఎన్టీఆర్ కు “భారతరత్న” డిమాండ్.. కుటుంబ డ్రామానా..? ఏటా ఇంతేనా..?

Muraliak