రాజుగారిపై వేటుకి అన్ని అస్త్రాలు బయటకు తీస్తున్న జగన్..!!

ఎన్నికల్లో విజయం సాధించిన రాజకీయ పార్టీకి అయిదులో మూడొంతుల మెజారిటీ సీట్లు వస్తే విజయం. కానీ.. నాలుగొంతులు వస్తే ఏం జరుగుతుందో ప్రస్తుత వైసీపీ పరిస్థితిని చూస్తే అర్ధమవుతోంది. అలాగే.. ఇబ్బడిముబ్బడిగా వచ్చే నాయకులను కూడా పార్టీలో చేర్చుకుంటే గత టీడీపీని చూసి నేర్చుకోవచ్చు. అలా.. వైసీపీ చేసిన ఓ పని వారికి మేకులా మారి గుచ్చుకుంటోంది. ఆ మేకు.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. చాలా పార్టీలు చుట్టేసిన ఆయన 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఎన్నికల్లో గెలిచి ఎంపీ కూడా అయ్యారు. కానీ.. ఇప్పుడు సొంతపార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూన్నారు. ఇన్నాళ్లూ ఓపిక పట్టిన జగన్ ఇప్పుడు రాజు గారిపైకి అస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

cm jagan giving shock to mp raghuramakrsihna raju
cm jagan giving shock to mp raghuramakrsihna raju

ఎంపీ రఘురామకృష్ణ రాజుకు చెక్..!

నియోజకవర్గానికి వెళ్లాలంటే భయమేస్తోందని వై క్యాటగిరీ భద్రత తెచ్చుకున్నారు ఎంపీ. అయినా.. నరసాపురం వచ్చింది లేదు. ఢిల్లీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా రోజూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం.. లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయడం తప్ప ఇన్నాళ్లూ ఆయన్ను లెక్కలోకి తీసుకోలేదు జగన్. నరసాపురంలో రాజుగారికి చుట్టం, ఆర్ధికంగా, సామాజికంగా బలవంతుడైన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుమారుడు గోకరాజు రంగరాజును పార్టీలో చేర్చుకున్నారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే ఈ చేరికను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికే వస్తే సిద్ధంగా ఉండాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది. ఎంపీగా అనర్హత వేటు వేయించి.. పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉప ఎన్నికకు వెళ్లాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త పార్టీలో చర్చనీయాంశమైంది.

కుమ్ములాటలపై సీఎం జగన్ సీరియస్..

నిజానికి.. నిన్నటి క్యాబినెట్ సమావేశంలో కూడా పార్టీలోని అంతర్గత కుమ్ములాటలపై జగన్ సీరియస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో పార్టీలోని రెండు వర్గాల కుమ్ములాటలు.. పార్టీపై నెగటివ్ కామెంట్స్.. ఇలా పార్టీకి నష్టం కలిగించే చర్యలపై జగన్ సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఉపేక్షిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని సీఎం జగన్ భావిస్తున్నారని అంటున్నారు. అందుకే ముందస్తు వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇందులో భాగంగానే రఘురామకృష్ణ రాజు మ్యాటర్ పై కూడా దృష్ణి పెట్టారని అంటున్నారు. మరి.. మున్ముందు ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.