జగన్ చిన్నాన్న ఇలాకాలో వైసీపీ తన్నులాట..! మంత్రులకు చేటు, పార్టీకి పోటు..!!

మొత్తం 19 సీట్లు..! వాటిలో 15 వైసీపీ గెలిచింది..!
మూడుకి మూడు ఎంపీలు వైసీపీ గెలిచింది..!
అందుకే సీఎం కూడా జిల్లాకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఏకంగా మూడు మంత్రి పదవులు, రెండు క్యాబినెట్ ర్యాంకు ఉన్న పదవులు ఇచ్చి.., 15 మందిలో ఐదుగురికి మంచి హోదా కల్పించారు..!
స్వయానా జగన్ చిన్నాన్న ఆ జిల్లా పార్టీ బాధ్యతలు మోస్తున్నారు..!

కానీ కొట్లాటలో ఆ జిల్లా ముందుంది. అవినీతి వ్యవహారాల్లో ఆ ఎమ్మెల్యేలు ఆరితేరారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదుల విభాగంలో ఆ జిల్లా జగన్ కి చిక్కులు తెస్తుంది. ఆవ భూముల నుండి, గ్రావెల్ తవ్వకాల వరకు… అన్నీ అధికార పార్టీకి మచ్చలుగా మారిపోయాయి. ఇప్పటికే ఆ జిల్లా అర్ధమయ్యే ఉంటుందిగా..! తూర్పుగోదావరి అండీ. ఈ ఇలాకాలో జగన్ కి వస్తున్న చిక్కులు, పార్టీకి ఎదురవుతున్న ఇబ్బందులు, జగన్ కల్పించుకోవాల్సిన అంశాలు ఏమున్నాయో కొంచెం లోతుగా వెళ్లి చూద్దాం..!!

తూర్పుగోదావరిలో 19 శాసనసభ స్థానాలున్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్, గ్రామీణ, పెద్దాపురం, మండపేట తప్ప మిగిలిన 15 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ఎంపీ స్థానాలు కూడా వైసీపివే. ఈ జిల్లా నుండి విశ్వరూప్, వేణుగోపాలకృష్ణ, కన్నబాబు ముగ్గురు మంత్రులు ఉండగా.., దాడిశెట్టి రాజా (తుని) విప్ గానూ.., జక్కంపూడి రాజా (రాజనగరం) కాపు కార్పొరేషన్ చైర్మన్ గానూ ఉన్నారు. అంటే 15 మందిలో ఐదుగురికి క్యాబినెట్ ర్యాంకు ఉన్నట్టే. పదవులు ఇవ్వడంలో జగన్ ఏమాత్రం లోటు చేయలేదు. కానీ…!

మొన్న ఏం జరిగిందంటే..!?

ఈ నెల 23న జరిగిన జిల్లా సమీక్ష సమావేశం రసాభాసగా మారి, అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. దీనికి కారణం టీడీపీ వాళ్ళ గోల కాదు.., అధికార పక్షం వాళ్ళ ఘర్షణలే. జిల్లాలో టిడ్కో ఇళ్లలో అవినీతి జరుగుతుంది అంటూ రాజ్యసభ సభ్యుడు సుభాష్ చంద్రబోస్ ఆరోపించడంతో మొదలైన రచ్చ.., చివరికి కుర్చీలు నెలకేసి కొట్టి, ఒకరినొకరు నెట్టుకునే వరకు వెళ్ళింది. మంత్రులు, కలెక్టర్ కళ్ళ ఎదురుగానే అధికార పక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో వేడి రగిల్చారు. అదుపు తప్పారు.., టీడీపీ వారికి అవకాశం ఇవ్వకుండానే ఒకరి బొక్కలు ఒకరు బయట పెట్టుకున్నారు. అందుకే ఇదేదో ముంచేలా ఉందని భావించిన కలెక్టర్ ఈ సమావేశాన్ని నిలిపివేసి అందర్నీ బయటకు పంపించేశారు. ఇప్పుడు దీని వెనుక కథకు వెళదాం..!!

బోస్ అసంతృప్తికి కారణం..!? అవినీతా..!? అప్రాధాన్యమా..!?

ముందుగా సుభాష్ చంద్రబోస్ వ్యవహారం గురించి చెప్పుకోవాలి. ఆయన ముందుగా ఈ సమావేశంలో తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కాకినాడలో జరుగుతున్న టిడ్కో ఇళ్ల అవినీతిని లేవనెత్తారు. దీంతో కాకినాడ సిటి ఎమ్మెల్యే ద్వారంపూడికి మండింది. ఇక్కడ బోస్ అసంతృప్తికి కారణం ఏమిటి అనేది పెద్ద ప్రశ్న..!? స్వతహాగా పెద్దగా అవినీతి మచ్చల్లేని బోస్ తన సొంత జిల్లాలో జరుగుతున్న అవినీతిని ఓర్వలేక ఇలా బయట పడ్డారా..!? తనకు ప్రాధాన్యత తగ్గుతుందని భావించి ఇలా బయటపడ్డారా..!? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
* జిల్లాలో అవినీతికి కొదవ లేదు. ఇసుక రాంపుల్లో అనధికార తవ్వకాలు జరుగుతున్నాయి. నాడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి మామూళ్లు వెళ్లినట్టే.. ఇప్పుడు ఈ నేతలకు వెళ్తున్నాయి. ఇళ్ల పట్టాల కోసం సేకరించిన స్థలాల్లో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో గ్రావెల్ తవ్వకాలు శృతి మించాయి. అందుకే వీటిని ఓర్వలేక ప్రశ్నిద్దామని బోస్ లేవనెత్తారు అనేది ఒక వాదన. మరోవైపు కూడా ఆలోచిస్తే..
* శాసనమండలి రద్దు కాకముందే తనను ఎమ్మెల్సీగా, మంత్రిగా రాజీనామా చేయించారు. రాజ్యసభ ఇచ్చారు. కానీ తన సామాజికవర్గానికి చెందిన వేణుగోపాలకృష్ణకి మంత్రి పదవి ఇచ్చి, పెత్తనం అప్పగించారు. ఇది బోస్ కి రాజకీయంగా మొదటి దెబ్బ. రెండున్నర దశబ్దాలుగా తనకు రాజకీయ శత్రువుగా ఉన్న తోట త్రిమూర్తులుని పార్టీలోకి తీసుకుని.., ప్రాధాన్యత ఇవ్వడం బోస్ కి రెండో దెబ్బ. బోస్ పోటీ చేసి ఓడిపోయిన మండపేటకి తోటని ఇన్చార్జిగా ఇవ్వడం బోస్ కి ఏమాత్రం నచ్చడం లేదు. అయితే బోస్ అసంతృప్తికి కారణాలు ఏమైనప్పటికీ.., జగన్ కి అత్యంత సన్నిహితుడైన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నియోజకవర్గ విషయంలో వేలు పెట్టడం మాత్రం పెద్ద కుంపటి రగిల్చినట్టే.

bullet proof vehicle for ap agriculture minister kurasala kannababu
bullet proof vehicle for ap agriculture minister kurasala kannababu

ముగ్గురు మంత్రులు ఉండి ఏం చేస్తున్నట్టు..!?

జిల్లాలో ముగ్గురు మంత్రులున్నారు. మూడు సామాజికవర్గాల(కాపు, శెట్టిబలిజ, ఎస్సీ) ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలో… ఈ మూడు సామాజికవర్గాలకు జగన్ ప్రాధాన్యత ఇస్తూ మంత్రి (కన్నబాబు – కాపు.., వేణుగోపాలకృష్ణ – శెట్టిబలిజ.., విశ్వరూప్ – ఎస్సీ) పదవులిచ్చారు. నిజానికి ఈ ముగ్గురి పెత్తనం జిల్లాలో పెద్దగా ఉండడం లేదు. కన్నబాబు చురుకైన నాయకుడు అయినప్పటికీ స్థానికేతరుడు కావడం ఇబ్బందిగా మారింది. వేణు గతంలో జెడ్పి ఛైర్మన్ చేసి.., అందరికీ సూపరిచితులే అయినప్పటికీ.., అదే సమాజికవర్గంలో బోస్ ఉండడంతో ఈ ఇద్దరి మధ్య పెత్తనం దోబూచులాడుతుంది. విశ్వరూప్ స్వతహాగా వివాద రహితుడు, ఏ అంశాలపై పెద్దగా మాట్లాడరు. చొరవ ఉండదు. ఇలా ముగ్గురు మంత్రులకు మూడు ఇబ్బందులు ఉండడంతో.. జిల్లా సమీక్ష సమావేశంల్ గొడవని అదుపు చేయలేకపోయారు. కనీసం సద్దుమణిగేలా చేయలేకపోయారు.

(జిల్లాలో ఇంకా చెప్పుకోదగిన రాజకీయ అంశాలు చాలానే ఉన్నాయి. కాపు రాజాల నియోజకవర్గాల్లో అవినీతి తంతు.., కొందరు ఎమ్మెల్యేల బహిరంగ వ్యాఖ్యలు.., ఆవ భూముల కోణం, గ్రావెల్ తవ్వకం ఇవన్నీ పార్టీలో అగ్ని పర్వతాన్ని లోపల దచేసాయి. ఎప్పుడైనా పైకి ఉబికె అవకాశం లేకపోలేదు. ఈ అంశాలను మరింత నిశితంగా రేపు చెప్పుకుందాం)..!!