Telangana Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. రీసెంట్ గా అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన వాహనంలో డబ్బులు తరలిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోవడం, ఆ సందర్బంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడం తెలిసిందే. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అయితే ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన పై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు చికిత్స నిమిత్తం హైదరాబాద్ అపొలో ఆసుపత్రిలో చేరారు. మరో పక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అసలు దాడే జరగలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీంతో ఈ అంశం రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది.
బాలరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ఆయనను పరామర్శించారు. ఆ ఫోటోలు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేశారు. బాలరాజును మంత్రి హరీష్ రావు కూడా ఆసుపత్రిలో పరామర్శించారు. తాజాగా బాలరాజు .. మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ అభ్యర్ధి వంశీకృష్ణ తన అనుచరులతో దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఎడమ బుగ్గపై ఓ ప్లాస్టర్ అంటించి ఉంది. తద్వారా రాళ్ల దాడిలో అక్కడ ఆయనకు గాయం అయినట్లుగా సంకేతం ఇచ్చారు. అయితే.. మంత్రులు కేటిఆర్, హరీష్ రావు ఆయనను పరామర్శించినప్పుడు బలరాజు బుగ్గపై ఎలాంటి గాయం, ప్లాస్టర్ లేదనీ, మరి మీడియా ముందుకు వచ్చిన సమయంలోనే అక్కడ ప్లాస్టర్ ఎందుకొచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
ఇదంతా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో చేస్తున్న డ్రామా అని కాంగ్రెస్ ఆరోపిస్తొంది. విశాఖలో వైఎస్ జగన్ పై కోడి కత్తి అంశం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ కాలుకి గాయం, రీసెంట్ గా బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి గాయం, తాజాగా గువ్వల బాలరాజు పై దాడి ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ వేస్తున్న సెంటిమెంట్ డ్రామాలేనని కాంగ్రెస్ అంటోంది. సానుభూతి ఓట్ల కోసం చేస్తున్న డ్రామాగా పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే @GBalarajuTrs ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
బాలరాజు ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో అడిగి తెలుసుకున్న కేటీఆర్
ప్రజాదరణ ఓర్వలేకనే తమపై దాడులకు తెగబడుతున్నారని కేటీఆర్ కి… pic.twitter.com/D5WbW7ZrLa
— BRS Party (@BRSparty) November 12, 2023
డ్రామా రావు డైరెక్షన్ అంటే ఇట్లనే ఉంటది.. pic.twitter.com/yAjI02j4P5
— Telangana Congress (@INCTelangana) November 12, 2023