DK Aruna: గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎన్నికైనట్లు ప్రచురించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఇఓ)కి ఈసీ లేఖ రాసింది. హైకోర్టు ఉత్తర్వులను తదుపరి గెజిట్ లో ప్రచురించాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు కాపీని జత చేస్తూ సీఈఓ కు ఈసీ అండర్ సెక్రెటరీ సంజయ్ కుమార్ లేఖ రాశారు.

జోగోలాంబ జిల్లా గద్వాల ఎమ్మెల్యేగా బీ కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల చెల్లదని ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల్లో తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసినందున ఆయనను అనర్హుడుగా ప్రకటించాలని కోరుతూ డీకే అరుణ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు .. నామినేషన్ సందర్భంగా తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసినందుకు శిక్షగా రూ.2లక్షల 50వేల జరిమానా విధించింది. ఖర్చుల నిమిత్త పిటిషనర్ డీకే అరుణకు రూ.50వేలు చెల్లించాలని ఆదేశించింది. కృష్ణమోహన్ రెడ్డి తర్వాత అత్యధిక ఓట్లు సాధించిన డీకే అరుణ ను 2018 డిసెంబర్ 12 నుండి ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. నాటి ఎన్నికల్లో గద్వాల నుండి బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అభ్యర్ధిగా కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ తరపున డీకే అరుణ పోటీ పడ్డారు. కృష్ణమోహన్ రెడ్డికి 1,00,057 ఓట్లు, అరుణకు 71,612 ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో డీకే అరుణ తెలంగాణ అసెంబ్లీ సెక్రెటరీ కార్యాలయంలో హైకోర్టు తీర్పు కాపీ అందజేసి తదనుగుణంగా తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరారు. అసెంబ్లీ సెక్రెటరీ నుండి స్పందన రాకపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ తరపున గద్వాల నుండి పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత డీకే అరుణ బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ ఉన్నారు. ఈసీ లేఖపై డీకే అరుణ స్పందిస్తూ ఈసీ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే తాను అసెంబ్లీ సెక్రెటరీని కలవనున్నట్లు వెల్లడించారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే .. బీజేపీ నేతగా ఉన్న డీకే అరుణ .. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చలామణి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. బీజేపీకి రాజీమానా చేసి కాంగ్రెస్ లో కొనసాగితే ఆమె శాసనసభ సభ్యత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొంటే ఆ పార్టీ నేతలు అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు లేఖ రాసే అవకాశాలు ఉంటాయి. ఈ వ్యవహారం ఎలా ఉంటుందో వేచి చూడాలి.