ఏపిలో మరో కొత్త రాజకీయ పార్టీ రానుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, బీసీ నేత రామచంద్ర యాదవ్ ప్రారంభిస్తున్నారు. ఈ విషయాన్ని ఆదివారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజా సింహ గర్జన రాజకీయ పార్టీ పోస్టర్లను నేతలతో కలిసి ఆవిష్కరించారు రామచంద్రయాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి రహిత సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు – విజయవాడ మధ్య నాగార్జున యూనివర్శిటీ ముందు జూలై 23న ప్రజా సింహ గర్జన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం దోపిడీ పాలన నడుస్తొందని ఆయన ఆరోపించారు.

భూములు, మైనింగ్, ఇసుక పేరుతో వైసీపీ నేతలు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు రామచంద్ర యాదవ్. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల్లో రూ.30 వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాజధాని కట్టలేకపోయారనీ, మూడు రాజధానులని చెప్పి ఏపిలో రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితిని సీఎం జగన్ కల్పించారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వినియోగిస్తూ ఆణచివేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే రాజకీయ మార్పు కావాలని ఆయన అన్నారు. రాబోయే కొత్త పార్టీ రాష్ట్రంలో నవశకాన్ని తీసుకువస్తుందని ఆయన పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పెద్ద సంఖ్యలో నేతలు, అభిమానులు పాల్గొన్నారు.
Breaking: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూత