Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మొత్తం కేసులు నమోదు అయ్యాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసుతో పాటు, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేష్ పై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఎఫ్ఐఆర్ దర్యాప్తు అధికారులు మార్పులు చేశారనీ, సీఆర్పీసీ 41 ఏ కింద నోటీసులు జారీ చేయనున్నారని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ సుబ్రమణ్యం హైకోర్టుకు తెలియజేశారు.

దీంతో అరెస్టు అంశం లేకపోవడంతో హైకోర్టు లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఇక స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసి హైకోర్టు.. అప్పటి వరకూ లోకేష్ ను అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. ఇటీవల కాలం వరకూ లోకేష్ ను కూడా సీఐడీ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగినా హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతోఆయనకు ఆ ముప్పు తప్పినా కేసులో విచారణకు హజరుకావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన నేపథ్యంలో లోకేష్ తన యువగళం పాదయాత్రను అర్ధాంతరంగా నిలుపుదల చేశారు. ఆ తర్వాత లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. చంద్రబాబు అరెస్టుపై న్యాయపోరాటం సాగించేందుకు ఢిల్లీలో న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించి మూడు వారాలు అవుతోంది. చంద్రబాబు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై అక్టోబర్ 3 లేదా 6వ తేదీ విచారణ జరగనున్నది. ఈ తరుణంలోనే లోకేష్ కు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ కు సీఆర్పీసీ 41 ఏ నోటీసులు జారీ చేసేందుకు ఏపీ సీఐడీ అధికారులు ఢిల్లీకి వెళ్లారు.

అయితే ఢిల్లీలో సీఐడీతో పాటు మీడియా కంట్లో కూడా పడకుండా లోకేష్ తప్పించుకుని తిరుగుతున్నారుట. ఇప్పటి వరకూ ఉన్న ఐటీసీ మౌర్య హోటల్ లో రూమ్ ను లోకేష్ ఖాళీ చేశారట. అలానే ఆఫీసు కోసం వినియోగించుకుంటున్న ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీ గెస్ట్ హౌజ్ ను లోకేష్ ఖాళీ చేశారని అంటున్నారు. లోకేష్ రెగ్యులర్ గా వాడే కారును కూడా టీడీపీ పక్కన పెట్టిందట. ఎలాగోలా లోకేష్ ఆచూకీ పట్టుకుని సీఆర్పీసీ 41ఏ నోటీసులు అందజేయాలన్న ఉద్దేశంతో సీఐడీ అధికారులు చక్కర్లు కొడుతున్నారుట. హైకోర్టు కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో సీఐడీ విచారణకు లోకేష్ సహకరించాలని ఆదేశించడంతో నోటీసులు అందుకుంటే విచారణకు హజరు కావాల్సి ఉంటుంది. ఈ తరుణంలో లోకేష్ సీఐడీ అధికారుల నుండి నోటీసులు స్వీకరిస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.