AP Skill Development Scam: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయడంతో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ వ్యవహారం తీవ్ర సంచలనం అయ్యింది. ఏపీ సీఐడీ అధికారులు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హజరుపర్చగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించారు. చంద్రబాబు తరపున దాఖలు చేసిన హౌస్ రిమాండ్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించడంతో పాటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. అంతే కాకుండా ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. దీంతో ఆదివారం అర్ధరాత్రి నుండి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉన్నారు.

ఆ తర్వాత సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు తొలుత ఏపీలో, ఆ తర్వాత తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో, ఆ తదుపరి దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా మీడియా సమావేశాలను నిర్వహించి స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ ఎలా జరిగింది. ఇందులో చంద్రబాబు పాత్ర ఇది అంటూ వివరించడం జరిగింది. ఇంత వరకూ ఏపీ సీఐడీ అధికారులు ఓ కేసు విషయంలో రెండు రాష్ట్రాల్లో, దేశ రాజధానిలో మీడియా సమావేశాలను నిర్వహించి కేసు పూర్వాపరాలు వివరించిన దాఖలాలు లేవు. కానీ మొదటి సారిగా సీఐడీ అధికారులు వరుస మీడియా సమావేశాలు నిర్వహిస్తూ కేసు వివరాలు వెల్లడిస్తుండటంతో ఈ కేసును ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్ధం అవుతోంది. మరో పక్క ఈ కేసులో నిందితుడుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయడంతో కేసు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలోనే ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐడీ చీఫ్ సంజయ్ చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి. ఈ కేసుకు సంబంధం ఉన్న పలువురు ఇప్పటికే అరెస్టు అయ్యారనీ, అయితే వారిని ఈడీ అరెస్టు చేసిందని చెప్పారు.

స్కిల్ డెలప్ మెంట్ స్కామ్ కేసును ఈడీ కూడా దర్యాప్తు చేస్తూ ఇప్పటికే సీమెన్స్ సంస్థ మాజీ ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ ఖన్వీల్కర్, స్కిల్లర్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఆర్ధిక సలహాదారు ముకుల్ అగర్వాల్, సీఏ సురేష్ గోయెల్ ను అరెస్టు చేశారని చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు సంబంధించి దస్త్రాలపై 13 డిజిటల్ సంతకాలు చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసామని చెప్పారు. ఈ స్కామ్ లో చంద్రబాబు పాత్ర ఆధారాలతో సహా నిరూపితం చేయడంతో ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించిందన్నారు. ఈ కేసులో మరో ఏడుగురుని అరెస్టు చేయాల్సి ఉందని చెప్పారు. చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో అచ్చెన్నాయుడు, నారా లోకేష్ పేర్లను ప్రస్తావించింది ఏపీ సీఐడీ. దాంతో పాటు సంజయ్ మాటలను బట్టి చూస్తే ఈ కేసులో మరిన్ని అరెస్టులు కూడా జరగవచ్చని అనుకుంటున్నారు.
నేడో రోపో మరిన్ని అరెస్టులు జరిగిన పక్షంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం ఉండదన్న మాట వినబడుతోంది. సంజయ్ చెప్పినట్లుగా ఈ కేసులో అరెస్టు కానున్న ఆ ఏడుగురు ఎవరు.. అన్నది ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో లోకేశ్ ను అరెస్టు చేయాలన్న ఆలోచనలో సీఐడీ ఉంది అన్నట్లుగా ఆయన సతీమణి బ్రాహ్మణి వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్ధం అవుతోంది. బ్రాహ్మణి నోటి వెంట అరెస్టు మాట వచ్చిన రెండు రోజుల్లోనే సీఐడీ చీఫ్ నుండి అరెస్టుల మాట రావడంతో రానున్న రోజుల్లో మరి కొన్ని అరెస్టులు జరగవచ్చని తెలుస్తొంది.
అదే జరిగితే రాజకీయంగా మరింత వేడెక్కడం ఖాయమని అంటున్నారు. ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడంతో నారా లోకేష్ యువగళం పాదయాత్రను నిలిపివేసి చంద్రబాబుకు మద్దతుగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ ఢిల్లీలోనూ నిరసన కార్యక్రమాలను చేపట్టారు నారా లోకేష్. మరో పక్క చంద్రబాబును కేసు నుండి బయటకు తీసుకువచ్చేందుకు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. చంద్రబాబు బయటకు రాకముందే నారా లోకేష్ ను ఇదే కేసులో సీఐడీ అరెస్టు చేస్తే పరిస్థితి ఏమిటి అన్న ఆందోళనలో టీడీపీ శ్రేణులు ఉన్నారు. ఈ పరిణామాలు టీడీపీలో ఆందోళన రేకెత్తిస్తున్నాయని అంటున్నారు.