సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం నుండి భారీ ఊరట లభించింది. ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలన్న ఏపి ప్రభుత్వ విజ్ఞప్తిని యూపీఎస్‌సీ తోసి పుచ్చింది. అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని కేంద్ర హోంశాఖ సూచించింది. ఈ మేరకు ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. శాఖాపరమైన చర్యల్లో భాగంగా వెంకటేశ్వరరావు ఇంక్రిమెంట్లు రద్దు చేసే అవకాశం ఉంటుంది. మరో పక్క ఏపీ ప్రభుత్వ చర్యలను ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో సవాల్ చేయనున్నట్లు తెలుస్తొంది.

కాగా ఏబీ వెంకటేశ్వరరావు గతంతో భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఆయన సస్పెన్షన్ పై హైకోర్టు, సుప్రీం కోర్టు వరకూ వెళ్లి పోరాటం చేయగా, సుప్రీం కోర్టు ఆదేశాలతో తిరిగి విధుల్లోకి చేరారు. అయితే రీ జాయిన్ అయిన రెండు వారాల వ్యవధిలోనే సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై మరల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత ఏడాది మార్చి 18న తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టు ను ఆశ్రయించగా, ఆ పిటిషన్ విచారణ దశలో ఉంది.