Breaking News: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు కు బెయిల్ రాకముందే ఏపీ సీఐడీ మరో కేసు లో అరెస్టు చేసేందుకు పీటీ వారెంట్ పిటిషన్ ను ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ స్కామ్ కేసును సీఐడీ తెరపైకి తీసుకువచ్చి ఈ కేసులో చంద్రబాబును విచారించాల్సి ఉందని కోర్టుకు తెలిపింది. చంద్రబాబుకు వరుస కేసులు చుట్టు ముట్టడంతో యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించిన నారా లోకేష్ . పార్టీ అధినేత, తన తండ్రి చంద్రబాబును బయటకు తీసుకువచ్చేందుకు న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు.

పార్టీ అధినేతపైనే కేసు నమోదు చేసి జైలుకు తరలించడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. రాబోయే ఎన్నికలకు సిద్దమవుతున్న తరుణంలో చంద్రబాబు అరెస్టు పరిణామంతో టీడీపీ ఖంగుతిన్నది. దీంతో పార్టీ వ్యవహారాలు చక్కబెట్టేందుకు చంద్రబాబు బావమరిది, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగారు. నిన్నటి నుండి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మకాం వేశారు. నిన్న పార్టీ సీనియర్ నేతలతో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి అంశాలపై చర్చించారు. పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సహా పలువురు ముఖ్య నేతలు బాలకృష్ణతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు వ్యవహారాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకువెళ్లాలని పార్టీ నిర్ణయించింది.

మంగళవారం కూడా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన బాలకృష్ణ.. సీరియస్ కామెంట్స్ చేశారు. వాస్తవానికి నందమూరి బాలకృష్ణ పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటూ ఉంటారు. సినీ షూటింగ్ లతో ఎప్పుడూ బీజీగా ఉండే బాలకృష్ణ.. విరామ సమయంలో హిందూపురం ఎమ్మెల్యేగా అక్కడ పర్యటిస్తూ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మహానాడు వంటి సమావేశాలకు మాత్రమే బాలకృష్ణ హజరవుతుంటారు. అయితే ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ ఇద్దరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి రావడంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు.

‘దేనినైనా ఎదుర్కొనే సత్తా టీడీపీకి ఉంది. ఎవరికీ భయపడాల్సిన పని లేదు.. నేను వస్తున్నా.. ప్రజలంతా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. తెలుగు వారి పౌరుషం, సత్తా ఏమిటో చూపిద్దాం.. ఇలాంటి సంక్షోబాలు చంద్రబాబు ఎన్నో చూశారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.. చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజల్లోకి తీసుకువెళ్లండి’ అంటూ పార్టీ శ్రేణుల్లో విశ్వాస్వాన్ని నింపేలా మాట్లాడారు. జగన్ సర్కార్ పై ఘాటుగా కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం పార్టీ కార్యాలయంలో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్న బాలకృష్ణ .. రాబోయే రోజుల్లో అధికార పార్టీని టార్గెట్ చేసే విషయంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం లేకపోలేదని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడు బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఆ బాధ్యతలను బాలయ్య తన భుజస్కందాలపై వేసుకున్నట్లు కనబడుతోందన్న మాట వినబడుతోంది.