Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న చంద్రబాబుకు సంబంధించి సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ లపై విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవేళ విచారణ జరగాల్సి ఉంది. ఇప్పటికే రెండు రోజుల పాటు చంద్రబాబును కస్టడీ విచారణ చేసిన సీఐడీ అధికారులు తమకు విచారణ లో చంద్రబాబు సహకరించలేదనీ, మరో అయిదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పోలీస్ కస్టడీ పొడింపుతో పాటు చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్ పైనా ఒకే సారి వాదనలు విని ఆర్డర్స్ ఇస్తామని నిన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.

తొలుత తమ పిటిషన్ విచారణ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు, ముందుగా కస్టడీ పిటిషన్ పై విచారణ జరపాలని సీఐడీ తరపు న్యాయవాదులు నిన్న వాదనలు వినిపించారు. అయితే రూల్స్ ప్రకారం పిటిషన్ లపై విచారణ జరుపుతామని విచారణను మంగళవారం( ఈరోజు)కు న్యాయమూర్తి వాయిదా వేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఒక రోజు సెలవు పై వెళ్లినట్లుగా తెలుస్తొంది. దీంతో ఈ రెండు పిటీషన్లపై వాదనలు జరుగుతాయా లేదా రేపటికి వాయిదా పడతాయా అనే దానిపై సందిగ్దత నెలకొంది. దీంతో టీడీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. మరో పక్క సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇవేళ మెన్షన్ లిస్ట్ తో రావాలని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రాకు నిన్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం నిన్న సూచించారు.

అయితే ఈ వేళ సీజేఐ ధర్మాసనం ముందు మెన్షన్ లిస్ట్ అవకాశం లేకపోవడంతో నేరుగా విచారణ తేదీని ఖరారు చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఎల్లుండి నుండి అక్టోబర్ 2వరకూ సుప్రీం కోర్టుకు సెలవులు ఉన్న కారణంగా రేపటి విచారణ లిస్ట్ చంద్రబాబు పిటిషన్ ఉంటుందా లేక సెలవుల అనంతరం లిస్ట్ అవుతుందా అనే సందిగ్దత నెలకొంది. మరో వైపు హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్ పై ఇవేళ విచారణ జరగనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు తో పాటు అంగళ్లు విధ్వంసం కేసులో బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.