Sattenapalli TDP: దివంగత టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుటుంబానికి పార్టీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు. సత్తెనపల్లి టీడీపీ ఇన్ చార్జిగా ఇటీవల పార్టీలో చేరిన సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ను నియమించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణే సత్తెనపల్లి అభ్యర్ధి అనేది చెప్పకనే చెప్పారు. ఇప్పటికే సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధిత్వాన్ని దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, మరో టీడీపీ నేత మన్నెం శివ నాగమల్లేశ్వరరావులు ఆశిస్తూ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. వీరు ముగ్గురు పోటాపోటీగా అన్న క్యాంటిన్ లు కూడా నిర్వహిస్తున్నారు.

కోడెల వర్గంలో అసంతృప్తి
అయితే పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్న సామెత మాదిరిగా నియోజకవర్గంలో ముగ్గురు నేతలు పోటీ పడుతుండటంతో అనూహ్యంగా పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణను పార్టీ ఇన్ చార్జి గా నియమించింది పార్టీ. ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేడు ఉత్తర్వులు జారీ చేశారు. కన్నా లక్ష్మీనారాయణ 1989 నుండి 2004 వరకూ పెదకూరపాడు నుండి నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి అయిదవ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించారు. కొద్ది నెలల క్రితం బీజేపీ రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఆయనకు అనూహ్యంగా సత్తెనపల్లి టీడీపీ ఇన్ చార్జి ఇవ్వడంపై కోడెల అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ కోడెల
డాక్టర్ కోడెల శివప్రసాదరావు టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీ లో సేవ చేశారు. 1983 నుండి 2004 వరకూ అయిదు సార్లు నరసరావుపేట నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల శివప్రసాదరావు ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం సత్తెనపల్లి నుండి 2014లో పోటీ చేసి విజయం సాధించిన కోడెల తొలి శాసనసభాపతిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో అంబటి రాంబాబు చేతిలో పరాజయం పాలైయ్యారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పై పలు ఆరోపణ చేస్తూ కేసులు నమోదు చేయడం, ఆ తర్వాత మనస్థాపంతో ఆయన ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. శివప్రసాద్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కోడెల శివరామ్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలతో పాటు తన తండ్రి శివప్రసాద్ పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ టీడీపీ కేడర్ తో మమేకం అయ్యారు. తండ్రి మరణం తర్వాత పూర్తిగా సత్తెనపల్లికే పరిమితం అయ్యారు.

చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారన్న నమ్మకంతో
పార్టీ అధినేత చంద్రబాబు తనకు ప్రాధాన్యత ఇస్తారన్న నమ్మకంతో ఉన్నారు శివరామ్. తన తండ్రికి నియోజకవర్గంలో ఉన్న పరిచయాలతో పాటు టీడీపీకి ఉన్న బలంతో సత్తెనపల్లిలో పాగా వేయవచ్చని శివరామ్ భావించారు. ఒకటి రెండు సందర్భాల్లో కోడెల వర్గం నేతలు చంద్రబాబును కలిసి శివరామ్ ను ఇన్ చార్జిగా ప్రకటించాలని కోరినా ఇటీవల కాలం వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయినా శివరామ్ పట్టువదలని విక్రమార్కుడిలా పార్టీ పరంగా తన పని చేసుకుంటూ ముందుకు వెళ్తూ వచ్చారు. ఏ వ్యవహారాలు ఎలా ఉన్నా రాజకీయాల్లో సాధారణంగా దివంగత నేత కుమారుడికే రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తూ ఉంది. కానీ కోడెల కుటుంబం విషయంలో టీడీపీ ఆయన కుమారుడిని చిన్న చూపు చూడటం పట్ల ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా గతించే వరకూ ఒకే పార్టీలో కొనసాగిన కోడెల శివప్రసాద్ కుటుంబానికి పార్టీ అన్యాయం చేస్తొందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నిర్ణయాన్ని కోడెల శివరామ్ గౌరవించి సైలెంట్ గా ఉంటారా.. ఆయన అభిమానులు, శివరామ్ ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.
Big Breaking: తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్ .. షరతులతో కూడిన బెయిల్ మంజూరు