Breaking: సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కు తన రాజీనామా లేఖను పంపారు కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన త్వరలోనే బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ నేతలతో కిరణ్ కుమార్ రెడ్డి సంప్రదింపులు జరిపినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం 2014 ఎన్నికలకు ముందు జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. అయితే ఆ పార్టీకి నుండి ఎవరూ గెలవలేదు.

ఎన్నికల తర్వాత కొంత కాలం పాటు మౌనంగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో అయితే చేరారు కానీ యాక్టివ్ గా లేరు. అయితే ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్ కావాలన్న ఆలోచనలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారని సమాచారం. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలని భావిస్తున్న ఆ పార్టీ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డితో సంప్రదింపులు జరిపింది. దీంతో ఆయన బీజేపీలో చేరడానికి సిద్దమైయ్యారనీ, అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే క్రియాశీలకంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు.
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి, నల్లారి కుటుంబాల మధ్య దశాబ్దాల కాలంగా రాజకీయ వైరం ఉంది. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి హవా దెబ్బకొట్టాలంటే తను బీజేపీలో చేరక తప్పదని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తొంది. అందుకే ఆయన బీజేపీలో చేరుతున్నారని సమాచారం. రాష్ట్రంలో బీజేపీకి బలం లేకపోయినా కేంద్రంలో మరో సారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పెద్దిరెడ్డిని ఎదుర్కొవాలంటే బీజేపీ గూటికి చేరడమే మేలని నల్లారి భావించారు. అందుకే నేడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే బీజేపీ కేంద్ర పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ జాతీయ స్థాయిలో ఓ పదవి ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో క్రియాశీల బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
మహిళా సర్పంచ్‌కి క్షమాపణ చెప్పి వివాదాన్ని పరిష్కరించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య