CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతం ఫ్యామిలీతో యూకే పర్యటనలో ఉన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని ఈ నెల 12న తిరిగి రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రానికి వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తారనీ, ఆ సమావేశంలోనే అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. దాదాపుగా ఈ నెల 20వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని అంటున్నారు.

జరగబోయే కేబినెట్ భేటీలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారనీ, అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులపై చర్చించడంతో పాటు అసెంబ్లీ సమావేశాల తేదీని ఖరారు చేస్తారని భావిస్తున్నారు. ఈ సారి అసెంబ్లీ సమావేశాలు పది నుండి పదిహేను రోజుల పాటు నిర్వహించవచ్చని సమాచారం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సారిగా ఇన్ని రోజుల పాటు వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నారని తెలియడంతో ప్రాధాన్యత ఏర్పడింది.

అయితే ఈ సమావేశాల్లోనే చాలా కీలకమైన బిల్లులను వైసీపీ సర్కార్ ప్రవేశపెట్టనున్నదని ప్రచారం జరుగుతోంది. షెడ్యుల్ ప్రకారం అయితే సార్వత్రిక ఎన్నికలకు మరో ఎనిమిది నెలల సమయం ఉంది. కానీ జమిలి ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టినట్లయితే ఇవే చివరి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అవుతాయని కూడా భావిస్తున్నారు. దీంతో వైసీపీ ఎన్నికలకు వెళ్లేందుకు సన్నద్దం అవుతూ ప్రజలకు మరింత మేలు చేసే పలు కొత్త పథకాలను తీసుకువచ్చే ఆలోచన చేస్తుంది. ఈ క్రమంలో అనేక కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరో కీలక విషయం ఏమిటంటే .. న్యాయపరమైన చిక్కుల కారణంగా జగన్మోహనరెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల అంశం ఆలస్యం అవుతోంది.

విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా చేయాలని జగన్ సర్కార్ కృత నిశ్చయంతో ఉంది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణ పరిధిలో ఉండటం, డిసెంబర్ నెలలో విచారణ జరగనుండటంతో దానిపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై కూడా కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. రాబోయే ఎన్నికలకు మూడు ప్రాంతాల అభివృద్ధి, మూడు రాజధానుల అంశమే తమ ప్రధాన అజెండా అని ఇంతకు ముందే వైసీపీ పెద్దలు పలువురు పేర్కొన్నారు. మూడు రాజధానులపై హైకోర్టు వ్యతిరేక తీర్పు ఇచ్చిన నేపథ్యంలోనే సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా న్యాయపరమైన చిక్కులు రాకుండా వికేంద్రీకరణకు సంబంధించి మెరుగైన బిల్లు తీసుకువస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా బిల్లు ప్రవేశపెట్టే అలోచన కూడా ఉందని అంటున్నారు.

అప్పట్లో శాసనమండలిలో వైసీపీకి బలం లేకపోవడంతో అక్కడ ఆమోదం పొందకపోయినా నేరుగా గవర్నర్ కు పంపి ఆమోదింపజేసుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేనందున మెరుగైన వికేంద్రీకరణ బిల్లును తీసుకువస్తారనే చర్చ జరుగుతుంది. ఒక వేళ అది సాధ్యం కాకపోతే పరిపాలన వికేంద్రీకరణ దిశగా తమ అడుగులు ఉన్నాయని చెప్పడం కోసం సీఎం క్యాంప్ కార్యాలయాన్ని విశాఖ కు షిప్ట్ చేసి సీఎం జగన్ అక్కడి నుండి పరిపాలన సాగించే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో విశాఖకు తన మకాంను జగన్ మార్చనున్నారని ఇప్పటికే వెల్లడించారు. కోర్టు తీర్పులు ఎలా ఉన్నా తాము చేయాలనుకున్నది చేసి తీరుతామ్, తర్వాత న్యాయపరమైన చిక్కులు వస్తే వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామ్ అనే రీతిలో ఉన్న వైసీపీ పెద్దలు మూడు రాజధానుల అంశంపై ఈ సమావేశాల్లోనే ఒక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని బలంగా వినబడుతోంది. చూడాలి ఏమి జరుగుతోంది.
Jio Air Fiber: జియో సిమ్ కార్డ్ వాడే ప్రతీ ఒక్కరూ చదవాల్సిన న్యూస్ ఇది !