Chandrababu: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇటీవల ఏపీ హైకోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబుకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో మంగళవారం విచారణకు రానుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనంలో ఐటెం నం.64 కింద ఏపీ సర్కార్ పిటిషన్ లిస్ట్ అయ్యింది. స్కిల్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడి, ఆ నిధులను టీడీపీ ఖాతాలకు మళ్లించారు అనేందుకు సీఐడీ ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదంటూ చంద్రబాబు కు ఏపీ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ ఇవ్వడాన్ని ఏపీ సర్కార్ తప్పుబడుతూ ఈ నెల 21న సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో ఏపీ హైకోర్టు మినీ ట్రయల్ నిర్వహించడంతో పాటు, వాస్తవాలను పరిగణలోకి తీసుకోవడంలో పొరబడిందని, అందువల్ల చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరింది ఏపీ సర్కార్. మెరిట్స్ పై అభిప్రాయం వ్యక్తం చేయడం ద్వారా హైకోర్టు తన పరిధిని ఉల్లంఘించిందని కాబట్టి హైకోర్టు తీర్పును కొట్టేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టు అయిన చంద్రబాబుకు ఏపీ హైకోర్టు గత నెల మూడవ వారంలో ఆరోగ్య కారణాల రీత్యా మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాంతో ఆయన దాదాపు 52 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్ నుండి విడుదల అయ్యారు.
ఈ నెల 28వ తేదీతో మద్యంతర బెయిల్ గడువు ముగిసి రాజమండ్రి సెంట్రల్ జైల్ ముందు చంద్రబాబు హజరు కావాల్సి ఉండగా, ఈ నెల 20వ తేదీన చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. మరో పక్క స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో అక్టోబర్ 17న విచారణను ముగించి తీర్పు వాయిదా వేసింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ నెల 30వ తేదీన సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. ఈ కేసు విచారణ లోపు క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువరిస్తామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. వీటిపై ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలోనే స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణకు రావడం జరిగింది. ఈ తరుణంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం తీర్పు ఎలా ఉంటుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Breaking: బీఆర్ఎస్ సర్కార్ కు ఈసీ బిగ్ ఝులక్ .. రైతు బంధు నిధుల విడుదలపై కీలక ఆదేశాలు