Chandrababu Arrest: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై పలువురు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉన్నారు. ఏపీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తుండగా, వివిధ రాష్ట్రాల్లోనూ టీడీపీ సానుభూతిపరులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు చేశారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలోనూ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
హైదరాబాద్ లో చంద్రబాబుకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించడంపై మంత్రి కేటిఆర్ స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అంశం, ఆంధ్రా పంచాయతీ అక్కడే తేల్చుకోవాలి అని అన్నారు మంత్రి కేటిఆర్. మంగళవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ పంచాయతీలకు తెలంగాణను వేదిక కానివ్వమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను టీడీపీ, వైసీపీ ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు.

చంద్రబాబు అరెస్టు ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న యుద్దమని అన్నారు. తమ పార్టీ నేతలు ఏవరైనా స్పందిస్తే అది వారి వ్యక్తిగతమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం చూపించే అంశం కాదని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ వివాదాలతో తెలంగాణకు సంబంధం లేదని అన్నారు. చంద్రబాబు అరెస్టు అయింది ఆంధ్రప్రదేశ్ లో, ర్యాలీలు, ధర్నాలు చేయాలనుకుంటే అక్కడే చేయాలని సూచించారు. అక్కడ చేయకుండా ఇక్కడ రాజకీయ రాద్ధాంతం చేస్తానంటే ఎలా అని ప్రశ్నించారు.

తెలంగాణలో ఈరోజు ఒకరు ర్యాలీ చేస్తే .. రేపు మరొకరు చేస్తారు, పక్కింటి పంచాయతీ కూడా ఇక్కడ తేల్చుకుంటారా అని ప్రశ్నించారు. విజయవాడలో, అమరావతిలో, లేదా రాజమండ్రిలో ర్యాలీలు చేయండి, ఒకరితో మరొకరు తలపడండి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. ఏపీలో ఉన్న సమస్యలపై హైదరాబాద్ లో కొట్లాడతా అంటే ఎలా, ఇది సరైంది కాదు అని అన్నారు. ఇక్కడ మేం ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నాం, శాంతి భద్రతల సమస్య వస్తే ఎలా, ఇలాంటి వాటిని ఇక్కడ ఎలా అనుమతిస్తామని అన్నారు. ఆ రెండు పార్టీలకు తెలంగాణలో ఉనికి లేదు, స్థానం లేదని చెప్పారు. తెలంగాణలో అన్ని ప్రాంతాల వారు కలిసిమెలసి ఉన్నారని అన్నారు.

చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో తాము తటస్థంగా ఉన్నామనీ, ఇలాంటివి చాలా సున్నితమైన అంశాలు, వాటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నారు. ప్రస్తుతం ఆ విషయం న్యాయస్థానం పరిధిలో ఉందని అన్నారు. చంద్రబాబు న్యాయపోరాటం చేస్తున్నారని, ఆయనకు జరగాల్సిన న్యాయం కోర్టులో జరుగుతుందని అన్నారు. వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లు తనకు మిత్రులేననీ, ఆంధ్రవాళ్లతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. లోకేష్ తనకు కాల్ చేసి ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వలేదని అడిగారనీ, ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దన్న ఉద్దేశంతో ఎవరికీ అనుమతి ఇవ్వమని చెప్పానని అన్నారు.