Undavalli Arun Kumar: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం అయిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ ఆయనను అరెస్టు చేయగా, ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండాల్సి వచ్చింది. ఈ తరుణంలో మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ..ఏపీలో చంద్రబాబు అరెస్టు కంటే అతి పెద్ద అరెస్టు త్వరలో జరగబోతున్నది అంటూ సంచలన కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఆ అరెస్టు తెలుగు రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసి తీవ్ర ప్రకంపనలు రేపుతుంది అన్నట్లు ఆయన పేర్కొనడంతో ఇంతకూ ఆ అరెస్టు ఎవరిది అనే చర్చ జరుగుతోంది.

చంద్రబాబు అరెస్టు ప్రభావంతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతారు, రోడ్డు మీదకు వచ్చి తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతాయి, రాష్ట్రం అట్టుడికిపోతుంది అనుకున్నారు కానీ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలతో టీడీపీ ఇచ్చిన రాష్ట్ర బంద్ పాక్షికంగా జరిగింది. ఏపీలో వాతావరణం ప్రశాంతంగా కొనసాగుతోంది. పార్టీ అధినేతనే కేసులో అరెస్టు చేసి జైలుకు పంపడంతో చాలా చోట్ల నాయకులు హౌస్ అరెస్టులకు పరిమితం అయ్యారు. దీనికి తోడు ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు అంత దూకుడుగా వెళ్లలేని పరిస్థితి. టీడీపీ ఆశించిన అనుభూతి అయితే రాలేదన్న మాట వినబడుతోంది.

ఈ తరుణంలో చంద్రబాబు అరెస్టుతో పోలుస్తూ అసలు అరెస్టు ముందు ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ అనడం సంచలనం రేపుతోంది. ఆ అరెస్టు జరిగితే అది అషామాషీగా ఉండదగనీ దాని తీవ్రత జాతీయ స్థాయిలో భారీ ప్రకంపనలకు కారణం అవుతుంది అన్నట్లుగా మాట్లాడటంతో అంత పెద్ద అరెస్టు ఎవరిది.. ఆ పెద్ద మనిషి ఎవరు అనేది మాత్రం ఆయన చెప్పలేదు. అది ఎవరూ మీరే ఊహించుకోండి అన్నట్లుగా వదిలివేశారు ఉండవల్లి అరుణ్ కుమార్.

చంద్రబాబుతో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో మాజీ మంత్రి, టీడీపీ యువనేత నారా లోకేష్ పేరు తీసుకువచ్చి అరెస్టు చేసినా ఆ అరెస్టు చంద్రబాబు కంటే పెద్దది ఏమీ కాదు. దీంతో మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఈనాడు అధినేత రామోజీరావు అరెస్టు ఉండవచ్చేమో అన్న అనుమానాలు వస్తున్నాయి. దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి పై న్యాయపోరాటం చేస్తున్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఆయన మార్గదర్శి అధినేత రామోజీపై పోరాటం ప్రారంభించారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు లో మార్గదర్శి కేసును 2018లో కొట్టివేస్తే దానిపై సుప్రీం కోర్టు వరకూ వెళ్లి మరీ పోరాటం చేస్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఉండవల్లికి బాసటగా ఇటీవల ఏపీ సర్కార్ కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యింది.

ప్రస్తుతం ఏపీ సర్కార్ మార్గదర్శి చిట్ ఫండ్ లో అక్రమాలు జరిగాయంటూ కేసులు నమోదు చేయడం, పలువురిని అరెస్టు చేయడం జరిగింది. ఆ కేసులో ఏ 1 గా రామోజీరావు, ఏ 2 గా శైలజా కిరణ్ ను పేర్కొన్నారు. అయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఏపీ సీఐడీ వారిని అరెస్టు చేయకుండా నోటీసులు, విచారణతోనే ఇప్పటి వరకూ సరిపెట్టింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. దీంతో ఉండవల్లి వెల్లడిస్తున్నది మార్గదర్శి కేసు అయి ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మార్గదర్శి కేసులో రామోజీరావును అరెస్టు చేస్తే దాని ప్రకంపనలు వేరే విధంగా ఉంటాయని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మీడియా మొఘల్ గా ఉన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నే స్వయంగా ఆయన నివాసానికి వచ్చి భేటీ అయ్యారు అంటే ఆయన స్థాయి ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆర్ధిక నేరలకు సంబంధించిన కేసుగా ప్రభుత్వం దీన్ని చూపుతోంది. కోర్టు ఆదేశాలు ఉన్నా కొత్త కొత్తగా నమోదు అవుతున్న కేసులతో ఏపీ సీఐడీ మార్గదర్శిపై దూకుడుగా వెళుతున్న కారణంగా ఉండవల్లి దీన్ని దృష్టిలో పెట్టుకునే వ్యాఖ్యలు చేసి ఉంటారని అందరూ అనుకుంటున్నారు.