చంద్రబాబుకి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన పురంధేశ్వరి..!

బీజేపీ ఏమిటీ జగన్ తో దోస్తీ అంటుంది..? ఆ సోము చుస్తే 24 గంటల్లో.. 20 గంటలు చంద్రబాబునే తిడతాడు..! ఈ జీవీఎల్ చూస్తే నోటి నుండి వచ్చే 10 మాటల్లో 9 మాటలు బాబుని/ టీడీపీని తిట్టడానికే వాడతాడు. పాపం..! టీడీపీకి బెంగ పట్టుకుంది. బాబుకి భయం వేసింది. అదిగదిగో బీజేపీ చుడండి టీడీపీ కోటని కూల్చేసి, ఆక్రమించేస్తుంది అనుకునేలా భయపడ్డారు. కానీ వీటన్నిటి నుండి టీడీపీకి, చంద్రబాబుకి ఓ పెద్ద ఉపశమనం కలిగింది.

హమ్మయ్య..! బీజేపీ మారలేదు..!!

రెండు నెలల నుండి బీజేపీలో ఈ ఆకస్మిక మార్పు కారణంగా టీడీపీ నేతలకు నిద్ర పట్టలేదు. ఇటు సోము వీర్రాజు, అటు జీవీఎల్.. మరోవైపు రామ్ మాధవ్, సునీల్ దేవధర్ వంటి వారు టీడీపీని టార్గెట్ చేసి, జగన్ ని వదిలేస్తుంటే బాబు మూగబోయారు. ఆత్మరక్షణలో పడ్డారు. రాష్ట్రం, కేంద్రం థమన్ టార్గెట్ చేస్తే ఎలా అంటూ ఓ ఆలోచనలోకి వెళ్లిపోయారు. అటువంటిది ఈ రోజు “ఈనాడు” లో వచ్చిన బీజేపీ పెద్దల ఇంటర్వ్యూలు చూసాక టీడీపీ నేతలు, చంద్రబాబు ప్రశాంతంగా నిద్రపోతారు. “హమ్మయ్య.! బీజేపీ ఏమి మారలేదు. వాళ్ళు అలాగే ఉన్నారు. ఆ పార్టీ నాలుకలు అలాగే ఉన్నాయి. అంటూ తమకి తాము భరోసా ఇచ్చుకునే ఉంటారు..! ఇంతకూ అంతగా ఈనాడు ఇంటర్వ్యూ లో బీజేపీ నేతలు ఏం చెప్పారు అనుకుంటున్నారా..?


* రాజధాని అమరావతిలోనే ఉండాలి. ప్రభుత్వ పనితీరు బాలేదు. అందుకు హైకోర్టు తీర్పులే నిదర్శనం. వైసిపికి ప్రజలే బుద్ధి చెప్తారు. అంటూ అచ్చమైన వైసీపీ వ్యతిరేకిలా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పురంధేశ్వరి చెప్పారు. ఈనాడు ఇంటర్వ్యూ లో ఇవే అంశాలు కీలకముగా ప్రస్తావించారు.
* జగన్ కి పరిపాలనపై అవగాహన లేదు. రాజధాని ఒకటే, అదీ అమరావతి మాత్రమే ఉండాలి. న్యాయవ్యవస్థపై దాడి మంచిది కాదు. ప్రధానిని విమర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలి. కరోనా సమయంలో పీపీఏ కిట్లు అడిగితే ఏం చేశారో చూసాం..! ఇంత కక్ష సాధింపు ధోరణి ఏంటి..? అంటూ బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ ఈనాడు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ రెండు ఇంటర్వ్యూలు చంద్రబాబు పరామన్న భోజనాలే. టీడీపీ నేతలకు ఫుల్ మీల్స్ లెక్క. బీజేపీ ఇలా వైసీపీని టార్గెట్ చేయడమే టీడీపీకి తక్షణ అవసరం. తద్వారా వచ్చిన వైసీపీ వ్యతిరేకత తమకు అనుకూలం అనేది వారి వాదన. ఇక్కడ మరో కీలక వాదన కూడా ఉంది. ఆ ఇంటర్వ్యూ వచ్చింది “ఈనాడు”లోఅంటే… చంద్రబాబు భజన పత్రికలో. అందుకే వీళ్ళు ఏం మాట్లాడారో.., ఈనాడులో ఏం రాసారో కూడా అనుమానించాల్సిందే.

బీజేపీ నాలుకలు అంతే..!?

ఏపీలో బీజేపీకి ఒక సిద్ధాంతం, ఒక విధానం, ఒక ప్రణాళిక అంటూ లేదు. టీడీపీని బలహీనం చేసి ప్రజల్లోకి వెళ్ళాలి అనుకున్నప్పటికీ… అధికార పక్షం చేస్తున్న తప్పులకు కూడా ప్రతిపక్షాన్ని నిందిస్తూ సోము వీర్రాజు నవ్వులపాలవుతున్నారు. ఆయనపై సోషల్ మీడియాలో వస్తున్నా సెటైర్లు అన్నీ ఇన్ని కావు. పోనీ ఇదే లక్ష్యంతో టీడీపీపై ఉన్నారా అంటే.. ఇంకొందరు బీజేపీ నాయకులూ వైసిపికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పోనీ టీడీపీ, వైసీపి రెండు పార్టీలకు బీజేపీ వ్యతిరేకమా అంటే.., అలా కూడా లేదు.

కీలక విషయాల్లో వైసీపిని వదిలేస్తూ.., కొన్ని కీలక విషయాల్లో టీడీపీ పాడుతున్న పాటకి శృతి కలుపుతూ తప్పుల మీద తప్పులు చేస్తుంది. అందుకే బీజేపీ నాలుకలు నాలుగైదు ఉన్నాయి. ఏపీలో బీజేపీ రంగులు, గొడుగులు, నాలుకలు అన్నీ భిన్నంగానే సాగిపోతున్నాయి. సోము, జీవీఎల్, పురంధేశ్వరి, సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ అనే రకరకాల పార్టీ శాఖలు తయారయ్యాయి.