Granite Corruption Audio: ప్రకాశం జిల్లాలో గ్రానైట్ అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యం.. అందులో సక్రమ మార్గాల కంటే.. అక్రమ మార్గాలే ఎక్కువగా ఉంటాయి. క్వారీ తవ్వకాల్లో రూ. 2 వేల కోట్ల మేరకు అక్రమాలు జరిగినట్టు ఏడాదిన్నర కిందట విజిలెన్సు నిర్ధారించింది. ఆ మేరకు ఫైన్లు కూడా విధించింది. ఈ వ్యవహారం కోర్టుల్లో ఉంది. ఇక ఆ జిల్లాలోని సంతమాగులూరు, బల్లికురవ, మార్టూరు మండలాల్లో 300 వరకు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రాళ్ళని తీసుకొచ్చి, పలుకులుగా చేసి విక్రయించడం ఈ ఫ్యాక్టరీల పని. క్వారీల తరహాలోనే ఈ ఫ్యాక్టరీలు కూడా వక్రమార్గంలోనే పయనిస్తున్నాయి. నెలకు సుమారుగా రూ. 250 కోట్ల వరకు అక్రమ లావాదేవీలు జారుతుంటాయి. దీనిలో సుమారుగా రూ. 3 కోట్ల వరకు అధికారులకు, వివిధ విభాగాలకు, రాజకీయ నేతలకు మామూలుగానే వెళ్తాయంటే నమ్మగలరా..!? అందుకు సాక్ష్యంగా ఓ ఆడియో ఫైల్ బయటకు వచ్చింది. అదేమిటో వినండి…

Granite Corruption Audio: ఇదీ గ్రానైట్ బాగోతం..!
గ్రానైట్ వ్యాపారులు అందరూ కలిసి సిండికేట్ గా ఏర్పడి ఒక లారీకి రోజుకి రూ. 7 వేలు ఇచ్చేలాగా మాట్లాడుకున్నారు. అది వసూలు చేసేది ఒకరు, ఆ వసూలైన మొత్తం జిల్లా స్థాయిలో అధికారులు, పోలీసులు, రెవెన్యూ, మీడియా విభాగాలకు పంచేది ఒకరు.. అయితే రెండు నెలల కిందట జిల్లాలోని ఓ పెద్ద నాయకుడి ముఖ్య అనుచరుడు దీనిలో తలదూర్చారు. నాయకుడి అండ ఉండడంతో అధికారులకు ఇవ్వాల్సిన మామూళ్లను ఆపేసారు. కలెక్ట్ చేసిన మామూళ్లను తానే మింగేశారు. అధికారులకు వెళ్లాల్సిన వాటా ఆగిపోవడంతో వారు పని చేయడం ప్రారంభించారు. మొన్న తనిఖీలు చేశారు. రెండు లారీలను పట్టుకుని ఫైన్ వేశారు. ఆ సందర్భంగా లారీల యజమాని, రోజువారీ వాటా వసూలు చేసి వ్యక్తి.. ఆ నాయకుడి అనుచరుడు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఇది….

ఈ ఆడియో ఫైల్ 19 నిమిషాల పాటూ ఉంది. (ఫైల్ అటాచ్మెంట్ ఉంది, వినగలరు)
ఒకటో నిమిషంలో ఆ ఫ్యాక్టరీ యజమాని “నా లారీలను పట్టుకున్నారు. దీనికి సమాధానం చెప్పండి” అని ప్రశ్నిస్తాడు. మరో వ్యక్తి “కోటయ్య గారూ సమస్య అవుతుంది. చిన్న చిన్నవి వదిలేయమని చెప్పండి” అంటాడు.
కోటయ్య : ఈ రోజు ఉదయం మూడు బళ్ళు మీ పేరే చెప్పారు. మస్తానయ్య మస్తానయ్య అంటూ చెప్తున్నారు. నంబర్ రాసుకుని వదిలేసారు. మూడో బండికి డౌట్ వచ్చింది. మూడు బళ్ళు వాళ్ళు మీ పేరే చెప్పారు.
మస్తానయ్య: ఏవండీ మద్దిరాల మీదుగా వెళ్లే ప్రతీ బండి ప్రసాద్ రెడ్డి వాళ్ళే చూసుకుంటున్నారు..
లారీ యజమాని: “బాబాయ్ .. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. బండి విజిలెన్స్ వాళ్ళు పట్టుకుంటే ఎవరు డబ్బులు కట్టాలి..!?
కోటయ్య: వెంకట్ రెడ్డిగారూ మీకు ఏం చెప్పారు..!? విజిలెన్సు వాళ్లకు ఎవరు రెస్పాన్సిబిలిటీ..!?
మస్తానయ్య: మొదట్లో వారం రోజులు చూసుకోమన్నారు. తర్వాత వాళ్లదే బాధ్యత అన్నారు. ఇప్పటికి మూడు నెలలు అవుతుంది కదా సర్..!? ….. ఇలా సంభాషణ సాగుతుంది… మధ్యలో జిల్లా సరిహద్దు దాటే క్రమంలో ఓ సీఐ కి రూ. లక్షలు ఇచ్చామని చెప్పుకోచ్చారు.
15 వ నిమిషంలో….
లారీ యజమాని: అన్నా ఏమి లేదన్నా..? మీరు ఒక లైన్ చూపించాలి. విజలెన్స్ వాళ్ళు సెట్ అయిపోయారు. మీరు ఇంత కట్టండి, మేము ఇంత కడతాం అంటే మేము కడతాం అన్నా,. మొన్న పేట సీఐ గారికి 8 లక్షలు కట్టిన వాళ్ళ .. వీళ్లకు కట్టలేమా..!? మీరు అది వెంకట్ రెడ్డిగారితో మాట్లాడండి అన్నా…
మస్తానయ్య: మంత్రిగారు ఉన్నారు కదా.., ఇంచార్జి గారూ ఉన్నారు కదా… దీనిలో విజలెన్క్ వాళ్ళతో మాట్లాడి సెట్ చేయండి అంటున్నారు మనవాళ్ళు…
లారీ యజమాని: ఇప్పటికే లారీకి 7 వేలు కడుతున్నాం. ఒక వేయి తగ్గించుకుంటే తగ్గించుకుంటాం… మీరు ఎంత అంటే ఎంత..!? మా పని ఈజీగా అయిపోవాలి. మాట్లాడేవారు ఎవరు..!? ఆ లైన్ చూపించాలి మాకు.
మస్తానయ్య : దీనిలో మంత్రిగారికి ఉంది అంటున్నారు కదా.. ఈళ్ళు కొంతమంది మంత్రిగారి దగ్గరకు పోదాం అంటే నేనే సంధి పెట్టట్లేదు.. ఏవండీ మాకు ఇట్టా ఇబ్బందులున్నాయి. మరి మీరు డబ్బులు తీసుకుంటున్నారు.. మాకు బళ్ళు పట్టుకుంటున్నారు.., ఎవరు బాధ్యత అని అడగాలని మొన్ననే పది మంది బయల్దేరారు… కానీ మధ్యలో ఉన్న వాళ్ళని వదిలేసి వెళ్లడం మంచిది కాదని ఆగిపోయారు.
లారీ యజమాని: అన్నా మీరు ఒక లైన్ చూపించండి. చాలా ఇబ్బందిగా ఉంది.
ఇలా మొత్తం 19 నిమీషాల సంభాషణలో ఎవరెవరికి ఎంత వాటా అనేది స్పష్టంగా మాట్లాడుకున్నారు. మంత్రిగారికి కూడా వాటా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఈ ఆడియో ఫైల్ ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది. విజిలెన్స్ ఉన్నతాధికారులకు కూడా చేరింది. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తుపై ఆదేశించనున్నట్టు తెలుస్తుంది…