‘సింగిల్ స్క్రీన్ ధియేటర్లు..’ ప్రేక్షకులకు ఇక జ్ఞాపకాలేనా..?

సినిమా అంటే.. టికెట్ల కోసం ఆరాటపడటం, ప్రేక్షకుల ఆనందం, హీరో అభిమానుల్లో కిక్కు, ఈలలు, కేకలు, కటౌట్లకు దండలు, పాలాభిషేకాలు, హారతులు, ఫైట్లు, డ్యాన్సులకు మైమరిచిపోవటం, తెరపై హీరో కనపడగానే పువ్వులు, కాగితాలు విసరడం, సెంటిమెంట్ సీన్లకు కన్నీళ్లు పెట్టుకోవడం, ఇంటర్వెల్ లో పాప్ కార్న్, సినిమా ఎంజాయ్ చేయడం, ఇంటికెళ్లడం ఓ అనుభూతి. ఈ కిక్కునిచ్చేది మల్టీప్లెక్సులు, ఓటీటీలు కాదు. ‘సింగిల్ స్క్రీన్ ధియేటర్లు’ మాత్రమే. దాదాపు 100 ఏళ్ల నుంచీ ప్రేక్షకుల్ని అలరిస్తున్న సింగిల్ స్క్రీన్ ధియేటర్లకు ఇప్పుడు అన్ని వైపుల నుంచీ కష్టం వచ్చింది. ఏకంగా హైదరాబాద్ లో అయిదు ధియేటర్లు మూసేయటం సినీ ప్రేమికుల్ని విచారంలో ముంచెత్తేదే..!

paining decision on single screen theaters
paining decision on single screen theaters

‘శాంతి.. నారాయణగూడ, అంబా.. మెహదీపట్నం, గెలాక్సీ.. టోలిచౌకి, శ్రీరామ.. బహదూర్ పూరా, శ్రీమయూరి.. కవాడిగూడ’ ఈ ధియేటర్లన్నీ దాదాపు మూసేశారు. ఇటివలే ధియేటర్లు తెరవడానికి ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చినా వీరెవరూ ధియేటర్లు నడిపేందుకు సిద్ధం కావట్లేదని తెలుస్తోంది. విశాలమైన ప్రాంగణం, భారీ సీటింగ్ కెపాసిటీ, 70mm స్క్రీన్లు, ఉద్యోగులకు ఉపాధి, ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన ఈ ధియేటర్లు ఇప్పుడు వ్యాపార కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నాయి. మల్టీప్లెక్సులు, ఓటీటీలు.. చాప కింద నీరులా గతంలోనే సింగిల్ స్క్రీన్లకు ఎసరు పెట్టాయి. అయితే.. ధియేటర్ రంగంలో ఉన్నవారికి అదే వ్యాపారం.. ధియేటర్లే జీవితం. కాబట్టి ధియేటర్లు ఫుల్స్ అయి నెలలు గడిచినా ఆక్యూపెన్సీ తగ్గుతున్నా నడిచాయి. పుండు మీద కారం చల్లినట్టు కరోనా వచ్చి ధియేటర్లపై మొత్తానికే ఎసరు పెట్టింది.

ఈ ధియేటర్లలో అమెజాన్ ప్రైమ్ గౌడౌన్ల కింద మార్చి రెంట్ కు తీసుకుందని.. శ్రీమయూరి ధియేటర్ కమర్షియల్ కాంప్లెక్స్ గా మారుతోందని తెలుస్తోంది. ఇన్నాళ్లూ ఆ ధియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులకు ఇకపై అవి జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి. ఒకప్పుడు పైరసీ అధికంగా ఉండి ధియేటర్ల మనుగడపై ప్రభావం చూపేవి. ఇప్పుడు పైరసీతో పాటు ఓటీటీలు, కరోనా.. మరింత ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. పర్మిషన్లు వచ్చినా ప్రేక్షకులు ఆదరణపై ధియేటర్ల యజమానులకు నమ్మకం కలగట్లేదనటానికి ఇదొక ఉదాహరణ అని చెప్పాలి.