Raj Tarun: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. అక్కినేని నాగార్జున నిర్మించిన `ఉయ్యాల జంపాల` సినిమాతో హీరోగా టాలీవుడ్లోకి అడుగు పెట్టిన రాజ్ తరుణ్.. మొదటి మూవీతో తనదైన నటన, బాడీ ల్యాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఈయన చేసిన సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్, ఈడోరకం ఆడోరకం చిత్రాలు మంచి విజయం సాధించాయి.
కానీ, ఆ తర్వాతే రాజ్ తరుణ్ కెరీర్ డల్ అయిపోయింది. కథల ఎంపికలో పొరపాటో లేక ఎందులో లోపమో తెలీదు గానీ.. వరుస పెట్టి సినిమాలు చేసినా సరైర్ హిట్ మాత్రం పడలేదు. 2020లో విడుదలైన ఒరేయ్ బుజ్జిగా పర్వాలేదనిపించుకున్నా.. ఆపై వచ్చిన పవర్ ప్లే, అనుభవించు రాజా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇక ఇటీవల ఈయన `స్టాండప్ రాహుల్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.
సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటించింది. మార్చి 18న రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగానే ఉన్నా.. దాన్ని ప్రజెంట్ చేయడంలో విఫలం అయ్యాడు. బలమైన ఎమోషన్స్ లేకపోవవడం, సంగీతంలో కొత్తదనం ఉండకపోవడం, బలహీనమైన పాత్రలు, హీరో ప్యాషన్ స్టాండప్ కామెడీ అయినప్పటికీ పెద్దగా హాస్యాన్ని పండించకపోవడం వంటి అంశాలు సినిమాకు మైనస్లు మారాయి.
తొలిరోజే యావరేజ్ సొంతం చేసుకోవడంతో.. ఈ సినిమా కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వచ్చాయి. దీంతో సినిమాను కొన్న బయర్యకు భారీ నష్టాలు మిగిలాయి. మొత్తానికి ఇలా వరుస ఫ్లాపులతో రాజ్ తరుణ్ నిండా మునిగిపోయారు. కెరీర్ పరంగా పూర్తి డైలమాలో పడ్డ ఈయన.. ఇప్పుడేం చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.