5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Share

మంగళగిరిలో రాజకీయం అనూహ్యంగా మలుపుతిరిగింది. నారా లోకేష్ కు ఇప్పటి వరకూ వెన్నుదన్నుగా ఉన్న గంజి చిరంజీవి టీడీపీ నుండి బయటకు వెళ్లారు. ఆయన వైసీపీలో చేరడం ఖాయమే. ఆయనకు వైసీపీ కూడా ఒక పదవి ఇస్తామని ఆఫర్ చేసిందన్నది టాక్. ఇంతకు గంజి చిరంజీవి రాజకీయ నేపథ్యం ఏమిటి.. ? ఆయన పార్టీ మారడం వల్ల టీడీపీకి వచ్చే నష్టం ఏమిటి..? మంగళగిరి నియోజకవర్గంలో ఎవరి బలం ఏమిటి..? నియోజకవర్గంలో గ్రౌండ్ రిపోర్టు ఏమిటి..?  అన్న విషయాలతో పాటు గత ఎన్నికల్లో ఏమి జరిగింది. గంజి చిరంజీవి వైసీపీలోకి వెళితే ఏమి జరగబోతుంది.. ? ఆయనకు ఇవ్వబోతున్న పదవి ఏమిటి..? అనే విషయాలను ఒక సారి పరిశీలిద్దాం. నిజానికి వైసీపీ.. నారా లోకేష్ కోసం ఒక గేమ్ వేసినట్లే. ఆయనకు ఒక ఉచ్చు వేసింది. నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లోనూ గెలవకుండా ఉండటం కోసం, అక్కడ కుప్పంలో చంద్రబాబుపై ఎలా టార్గెట్ చేశారో ఇక్కడ మంగళగిరిలో నారా లోకేష్ గెలవకూడదు అంటే ఏమి చేయాలనే క్రమంలో భాగంగా గంజి చీరంజీవి వైసీపీలోకి తీసుకోబుతున్నారు అని పేర్కొనవచ్చు.

గంజి చిరంజీవి రాజకీయ నేపథ్యం

గంజి చీరంజీవి 2014 లో టీడీపీ మంగళగిరి అభ్యర్ధిగా పోటీ చేశారు. అప్పటి ఎన్నికల సమయంలో నామినేషన్ల రెండు రోజుల ముందు వరకూ కూడా అభ్యర్ధి ఎవరనేది టీడీపీ డిక్లేర్ చేయలేదు. అక్కడ పద్మశాలీ సామాజికవర్గ ఓట్లు ఎక్కువ ఉన్నందున ఆ సామాజిక వర్గ నేతకు ఇస్తే బాగుంటుందని అప్పటికప్పుడు చంద్రబాబు .. గంజి చిరంజీవిని అభ్యర్ధిగా ప్రకటించారు. అయితే అప్పటికే టీడీపీ టికెట్ ఆశిస్తున్న కమ్మ సామాజికవర్గ నేతలు కొందరు గంజి చిరంజీవిని కిడ్నాప్ కూడా చేశారు. ఆ తరువాత ఆయనను బయటకు తీసుకువచ్చి నామినేషన్ వేయించింది పార్టీ. ఆ సింపతీతో కొన్ని ఓట్లు ఆయనకు పెరిగాయి. కేవలం 12 ఓట్ల తేడాతోనే ఆళ్ల రామకృష్ణ రెడ్డిపై ఓడిపోయారు. ఇదంతా ఆయన సొంత బలం కాదు. ఆయన సామాజికవర్గం ఎక్కువగా ఉంది. పార్టీ బలం తోడైంది. జనసేనతో పొత్తు ఉంది. ఇవన్నీ కలిసి వచ్చి వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు గంజి చిరంజీవి. అయితే వేరే అభ్యర్ధి అయితే గెలిచే వాళ్లేమో అన్న టాక్ కూడా అప్పట్లో నడిచింది. వాస్తవానికి గంజి చిరంజీవి అప్పటి వరకూ నియోజకవర్గంలో ఎవరికీ తెలియదు. రాజకీయాలకు కొత్త. పార్టీలో పెద్ద నాయకుడు ఏమి కాదు. కానీ ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వడం పార్టీ గొప్ప, దాన్ని ఆయన ఉపయోగించుకున్నారు. సింపతీ ఉపయోగపడింది. మరో విషయం ఏమిటంటే గంజి చీరంజీవి భార్య కాపు సామాజికవర్గానికి చెందిన మహిళ కావడంతో ఆ సామాజికవర్గం సపోర్టు చేసింది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తరువాత గంజి చీరంజీవి మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. చైర్మన్ గా ఉంటూనే చాలా వ్యవహారాల్లో వేలు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. అయితే ఆయన పార్టీ క్యాడర్ కు ఎప్పుడూ దగ్గర కాలేదు. మాస్ ఇమేజ్ ఏమి సంపాదించుకోలేదు. అంటీ ముట్టనట్లుగానే ఉన్నారు. తన సామాజికవర్గం ఎక్కువగా ఉన్నప్పుడు తనకు లభించిన పదవితో చొచ్చుకుపోవాలి. బలమైన నాయకుడుగా ఎదగాలి. కానీ ఆయన ఆ ప్రయత్నం చేయలేదు.

గంజి చిరంజీవి పార్టీ నుండి వీడటం వల్ల లోకేష్ కు నష్టమా..?

గంజి చీరంజీవి పార్టీ వీడటం వల్ల నారా లోకేష్ కు ఏమైనా నష్టం జరుగుతుందా అనేది తెలుసుకోవాలంటే ముందుగా నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలను ఒక సారి పరిశీలించాలి. ఈ నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 70వేల ఓట్లు ఉన్నాయి. వీటిలో 40వేలకు పైగా పద్మ శాలీ సామాజికవర్గం ఓట్లు ఉన్నాయి. ఎస్సీ సామాజికవర్గం ఓట్లు 57 వేల వరకూ ఉన్నాయి. కాపు సామాజికవర్గం 25వేలు, రెడ్డి సామాజికవర్గం 22వేలు, యాదవ కమ్యూనిటీ ఓట్లు 22వేలు, ముస్లింల ఓట్లు 20వేల ఓట్లు, కమ్మ సామాజికవర్గం 17వేల ఓట్లు, గౌడ 9 వేలు, రజకలు 8వేలు, పల్లె కారులు 7వేలు, వడ్డెర సామాజికవర్గం 6వేల ఓట్లు ఉన్నాయి. ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మాణ ఓట్లు వీటి కంటే తక్కువగా ఉంటాయి. ఇక్కడి నుండి ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు.  వచ్చే ఎన్నికల్లో జనసేనతో టీడీపీకి పొత్తు ఉంటే నారా లోకేష్ కు అనుకూలంగా ఉంటుందని ఆ పార్టీ అంతర్గత సర్వే లో ఉంది. నారా లోకేష్ గత ఎన్నికల్లో కేవలం 5500 ఓట్ల తేడాతోనే ఓడిపోాయారు. గత ఎన్నికల్లో జనసేన మద్దతు ఇచ్చిన సీపీఐ అభ్యర్ధికి పది వేల వరకూ ఓట్లు వచ్చాయి. సో.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వామపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా నారా లోకేష్ దిగితే ఆయన విజయం ఈజీ అవుతుందని ఆ పార్టీ భావిస్తొంది. ఇవన్నీ కలిసి వస్తున్నాయి కాబట్టి నారా లోకేష్ ఓడిపోవాలంటే ఆయనకు దగ్గర గా ఉన్న వాళ్లను బయటకు తీసుకురావడం వల్ల ఆయన బలాన్ని తగ్గించినట్లు అవుతుంది. అందుకే టీడీపీ నుండి బయటకు వచ్చిన గంజి చిరంజీవికి ఆప్కాబ్ లో గానీ డీసీసీబీలో గానీ ఒక ముఖ్యమైన పదవి ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

 

లోకేష్ కు ఒక పరీక్షే..!

గంజి చిరంజీవికి నామినేటెడ్ పదవి ఇచ్చి ప్రోత్సహిస్తే ఆ సామాజికవర్గ ఓట్లు టీడీపీకి మైనస్ అవుతాయనీ తద్వారా నారా లోకేష్ విజయావకాశాలను దెబ్బతీయవచ్చనేది ఒక రాజకీయ ప్లాన్. అయితే ఇక్కడ నారా లోకేష్ చేసిన తప్పులు కూడా ఉన్నాయి. ఆయన అప్రమత్తం కాకుండా అతి విశ్వాసంతో వ్యవహరించడం వల్ల మంగళగిరి క్యాడర్ కు దూరమైయ్యారు. ఒక నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు అంటే ఆ నాయకుడు ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. అలా కాకుండా ఆయన పెయిడ్ టీమ్ ను పెట్టుకుని వాళ్లతో రాజకీయం చేయడం కొంత మైనస్ గా మారిందని అంటున్నారు. ఉదాహరణకు తీసుకుంటే టీడీపీ నుండి చింతమనేని ప్రభాకర్, గొట్టిపాటి రవికుమార్ లు ఏ కార్యకర్త ఫోన్ చేసినా లిప్ట్ చేసి మాట్లాడతారు. ఒక వేళ మిస్డ్ కాల్ ఉన్నా తిరిగి వాళ్లకు ఫోన్ చేస్తారు. క్యాడర్ ను బాగా చూసుకుంటారు.అదే విధంగా వైసీపీలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి నాయకులు కూడా కార్యకర్తలను ఎప్పటికప్పుడు పట్టించుకుంటూ ఉంటారు. వీళ్లు మాస్ లీడర్లుగా ఎదిగారు. నారా లోకేష్ రాష్ట్ర స్థాయి నాయకుడు అయినా ఒక నియోజకవర్గంలో గెలవాలి అంటే అక్కడి క్యాడర్ కు దగ్గర కావాలి. వారి బాధలను అర్ధం చేసుకోవాలి. ఇది నారా లోకేష్ తెలుసుకోవాలి. గంజి చిరంజీవి పార్టీ నుండి బయటకు వెళ్లినా పెద్దగా నష్టం జరగకుండా ఉండాలంటే జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఇదే సమయంలో గంజి చిరంజీవికి వైసీపీ నామినేటెడ్ పదవి ఇచ్చి ప్రోత్సహిస్తే ఆయన వెంట టీడీపీ క్యాడర్ వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా లోకేష్ పై ఉంటుంది. ఇది రాజకీయంగా లోకేష్ కు ఒక పరీక్షే అని చెప్పవచ్చు.

ఎస్సీ, బీసీ: టీడీపీకి పొలిటికల్ దెబ్బ..! జగన్ వేసిన ఉచ్చు.. టీడీపీకి నష్టం తప్పదా..?


Share

Related posts

Medicine: మీ పిల్లలు మందులు వేసుకోవడానికి మారాం చేస్తున్నారా?అయితే  ఈ తియ్యటి వార్తా మీకోసమే!!(పార్ట్-1)

siddhu

కొనసాగుతున్న పోలింగ్

sarath

AP CID : వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకి సీఐడీ నోటీసులు

somaraju sharma