Highest Paid Indian Actors: సినీ తారల రెమ్యునరేషన్ గురించి తెలుసుకునేందుకు సామాన్యులు ఎప్పుడూ ఆసక్తి చూపుతూనే ఉంటారు. ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు మాత్రమే భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునేవారు. కానీ ఇటీవల కాలంలో సౌత్ హీరోల సైతం కళ్ళు చెదిరే రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు. నార్త్ హీరోలను బీట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరు..? సౌత్ ఇండస్ట్రీ నుంచి మొదట పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఏ స్థానంలో ఉన్నాడు..? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో హైయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లిస్ట్ తీస్తే.. టాప్ 1లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నిలిచారు. గత ఏడాది పఠాన్, జవాన్, డంకి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని షారుఖ్ తన మార్కెట్ ను భారీగా పెంచుకున్నారు. ప్రస్తుతం ఈయన ఒక్కో చిత్రానికి రూ. 150 నుంచి 250 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. రజనీ ఒక్కో సినిమాకు రూ. 150 నుంచి 210 కోట్ల మధ్యలో ఛార్జ్ చేస్తున్నారు.
మూడో స్థానాన్ని దళపతి విజయ్ సొంతం చేసుకున్నారు. ఇటీవలె రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఒక్కో చిత్రానికి రూ. 130 నుంచి 200 కోట్ల మధ్యలో పారితోషికం పుచ్చుకుంటున్నారు. టాప్-4లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నాడు. ప్రస్తుతం కల్కీ 2898 ఏడీ, రాజా సాబ్, సలార్ 2, స్పిరిట్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న డార్లింగ్.. రూ. 100 నుంచి 200 కోట్ల స్థాయిలో పారితోషికం అందుకున్నాడు.
ఇక బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్(రూ.100 నుంచి 175 కోట్లు), కండల వీరుడు సల్మాన్ ఖాన్(రూ. 100 నుంచి 150 కోట్లు), కమల్ హాసన్(రూ. 100 నుంచి 150 కోట్లు), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(రూ. 100 నుంచి 125 కోట్లు), అక్షయ్ కుమార్(రూ. 60 నుంచి 140 కోట్లు), అజిత్ కుమార్(రూ.105 కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో వరుసగా నిలిచారు. ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ 10 హీరోల జాబితాలో సౌత్ స్టార్సే ఎక్కువ మంది ఉండటం విశేషం.