మనలో చాలా మంది కాఫీ ప్రియులు ఉంటారు. కాఫీ అంటే పడి చచ్చిపోతారు. ఇక కొందరైతే కాఫీ తాగేందుకు విముఖతను వ్యక్తం చేస్తారు. కొందరు కాఫీని బరువు తగ్గేందుకు తమ డైట్లో చేర్చుకుంటారు. అయితే కొందరు మాత్రం అందులో కెఫీన్ ఎక్కువగా ఉంటుందని చెప్పి దాన్ని తాగరు. కానీ నిజానికి సాధారణ కాఫీకి బదులుగా బ్లాక్ కాఫీని తాగితే దాంతో ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. అదెలాగంటే…
* వ్యాయామం చేసేందుకు ముందుగా బ్లాక్ కాఫీని తాగాలి. దీంతో శక్తి ఎక్కువగా లభిస్తుంది కనుక ఎక్కువ సేపు వ్యాయామం చేసి ఆ ప్రయోజనం పొందవచ్చు.
* బ్లాక్ కాఫీ డిటాక్స్ డ్రింక్‌లా పనిచేస్తుంది. దీన్ని మధ్యాహ్నం లేదా సాయంత్రం తాగితే శరీరంలో ఉన్న వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. ఈ విధంగా బ్లాక్ కాఫీని సేవించాలని డైటిషియన్లు సూచిస్తున్నారు.
* చక్కెర, పాలు కలిపి కాఫీని తాగితే నిజానికి బరువు పెరుగుతారు. కానీ అవి కలపకుండా బ్లాక్ కాఫీని తాగితే బరువు తగ్గవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు బ్లాక్ కాఫీని నిత్యం తమ డైట్లో చేర్చుకోవాలి. దీంతో శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.
* చక్కెర, పాలు కలిపి కాఫీని తాగడం వల్ల దాంతో మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు లభించవని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాఫీ వల్ల మనకు లాభాలు కలగాలంటే దాన్ని బ్లాక్ కాఫీ రూపంలో తాగాలని అంటున్నారు.
అయితే గర్భిణీలు కాఫీని ఏ రూపంలోనూ తాగరాదు. అందులో ఉండే కెఫీన్ హాని కలిగిస్తుంది. అలాగే కాఫీని రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తాగరాదు. తాగితే నిద్రకు భంగం కలుగుతుంది. ఇక ఉదయం లేవగానే కూడా కాఫీ తాగరాదు. తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి. కనుక పైన తెలిపిన విధంగా బ్లాక్ కాఫీని తాగితే దాని వల్ల ఎక్కువ లాభాలను పొందవచ్చు.