Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా అరెస్టు చేసింది. ఇదే కేసులో గత నెల 27న సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి జ్యూడీషియల్ రిమాండ్ పై తీహార్ జైలులో ఉన్న సిసోడియాను ప్రత్యేక కోర్టు అనుమతితో ఈడీ అధికారులు మార్చి 7వ తేదీ నుండి మూడు రోజుల పాటు జైలుకు వెళ్లి విచారించారు. గురువారం విచారణ పూర్తి అయిన తర్వాత ఆయనను ఈడీ అధికారులు అరెస్టు చేసినట్లు ప్రకటించారు. రేపు మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ కింద సిసోడియాను అరెస్టు చేయడంతో ఆయన మరి కొంత కాలం జైలులో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా అరెస్టు చూపిన నేపథ్యంలో ఈడీ అధికారులు కోర్టులో కస్టడీ విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

కాగా మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్టు చేయడంపై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మనీష్ ను తొలుత సీబీఐ అరెస్టు చేసిందనీ, సీబీఐకి ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఎక్కడా వారికి డబ్బు దొరకలేదన్నారు. శుక్రవారం మనీశ్ బెయిల్ పిటిషన్ పై విచారణ ఉందనీ, ఆయన శుక్రవారం విడుదల అయ్యేవారని, అందు వల్ల గురువారం సిసోడియాను ఈడీ అరెస్టు చేసిందని అన్నారు. వాళ్ల లక్ష్యమంతా ఒక్కటే.. ఎట్టిపరిస్థితుల్లోనూ మనీశ్ ను లోపలే ఉంచడం, రోజుకో కొత్త నకిలీ కేసును సృష్టిస్తుండటం ప్రజలు చూస్తున్నారని, సమాధానం చెబుతారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన తర్వాత బెయిల్ కోసం ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. పిటిషనర్ ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టుల నుండి రక్షణ పొందే వీలు ఉండగా, నేరుగా సుప్రీం కోర్టుకు రావడం ఏమిటని ప్రశ్నించింది. దీంతో ఆయన బెయిల్ కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ నెల 4న విచారణ చేపట్టిన ధర్మాసనం వాదనలను శుక్రవారానికి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్ పై వాదనలు జరగాల్సిన తరుణంలో ఆయనను ఈడీ (మరో దర్యాప్తు సంస్థ) అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.