ABN Andhra Jyothi | Special Story NewsOrbit: కేసిఆర్ సర్కార్ ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థలను వెలివేసినట్లు కనబడుతోంది. 2014 లో కేసిఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏబీఎన్ – ఆంధ్రజ్యోతిపై కేసిఆర్ కక్ష గట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థలను వదిలి పెట్టేది లేదని కేసిఆర్ హెచ్చరించారు. అసెంబ్లీ సాక్షిగా నిషేదిస్తున్నట్లు ప్రకటించారు. రెండు దశాబ్దాల క్రితం వరకూ పత్రికలు అంటే రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు గౌరవం ఇచ్చే వారు. పత్రికలు కూడా సొంత అజెండా ఏమీ లేకుండా ఏ రాజకీయ పార్టీ నాయకుడు తప్పు చేసినా నిర్బయంగా వార్తలు ప్రచురించేవి. అయితే రానురాను పత్రికా రంగంలోనూ వ్యాపార ధోరణలు పెరగడం, రాజకీయ నాయకుల కనుసన్నల్లో కొన్ని పత్రికలు పని చేయడం, పలు మీడియా సంస్థలు వారి వారి అజెండాలకు అనుగుణంగా రాజకీయ పార్టీల మద్దతుగా వ్యవహరిస్తుండటంతో పత్రికా విలువలు పడిపోయాయి. మీడియాకు విలువ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. వ్యతిరేక వార్తలను ప్రజా ప్రతినిధులు, పాలకులు, నేతలు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది.

గతంలో ఒక పత్రికా విలేఖరి లేదా ప్రతినిధికి అవమానం జరిగితే మూకుమ్మడిగా అందరు ఆ నాయకుడి (పార్టీ) కార్యక్రమాన్ని బహిష్కరించే వాళ్లు. దాంతో సదరు పార్టీ నాయకులు క్షమాపణలు చెప్పేవారు. మీడియా మీద ఒంటికాలితో లేచే వాళ్లు కాదు. కానీ మీడియాలో వచ్చిన మార్పుల కారణంగా ఒకరిద్దరు మీడియా ప్రతినిధులను, మీడియాను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినా వారికి అనుకూలమైన మీడియా ప్రతినిధులు మాత్రం యధావిధిగా కార్యక్రమాలను కవర్ చేయడం జరుగుతోంది. మీడియా ద్వారా రాజకీయ నాయకులుగా ఎదిగిన వారూ ఓ స్థాయికి వచ్చిన తర్వాత మీడియాకే పాఠాలు చెబుతూ కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలోనూ ప్రస్తుతం పాలకపక్షానికి అనుకూల, వ్యతిరేక మీడియాలు తయారు అయ్యాయి. పలు జర్నలిస్ట్ సంఘాలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా, మరి కొన్ని వ్యతిరేకంగా ఉంటున్నాయి.
ఈ పరిణామాల కారణంగా పాలకులు ఒకటి రెండు పత్రికలపై కక్షగట్టి ఇబ్బందులు పెట్టినా, అవమానాలకు గురి చేసినా వారి ఏడుపు వారు ఏడవడం తప్ప మిగిలిన వారు కోరస్ పాడే పరిస్థితి లేదు. తాజాగా నిన్న గోల్డొండ కోట లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్స వేడుకల కవరేజీకి ఇతర అన్ని మీడియా సంస్థలను ఆహ్వానం పంపిన తెలంగాణ సర్కార్ .. ఆంధ్రజ్యోతి సంస్థలకు మాత్రం పంపలేదు. దీంతో ఆ సంస్థ డిబేట్ నిర్వహించింది. తెలంగాణ సర్కార్ మీడియా పట్ల అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టింది.
ఆదిలాబాద్ కాంగ్రెస్ లో భగ్గుమన్న వర్గ పోరు.. బీసీ ఐక్య వేదిక సభ రసాభాస.. వీహెచ్ సీరియస్
ఈ డిబేట్ లో పాల్గొన్న పౌర సంబంధాల శాఖ కమిషనర్ గా పని చేసిన విశ్రాంత ఐఏఎస్ చంద్రవదన్ ఆంద్రజ్యోతి పట్ల కేసిఆర్ వ్యవహరించిన తీరును వివరించారు. ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తిచూపుతున్నందుకు ఆంధ్రజ్యోతి సంస్థను తొక్కేద్దామని కేసిఆర్ 2014లోనే తనతో అన్నారని చంద్రవదన్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రకటనలు కూడా ఇవ్వొద్దని ఆదేశాలు కూడా ఇచ్చారన్నారు. ఈ పరిస్థితులకు కారణం కూడా మీడియా అనేది మరిచిపోకూడదు. తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉంటే ఒకలా, వ్యతిరేక ప్రభుత్వం ఉంటే మరోలా గతంలో మీడియా వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితులు వచ్చాయనే వాళ్లు ఉన్నారు.