Pawan Kalyan: పవన్ కల్యాణ్ Pawan Kalyan ఈ ఏడాదితో ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు. ఇన్నేళ్లలో ఆయన చేసింది 26 సినిమాలు. ఇటివలే ఆయన నటించిన వకీల్ సాబ్ విడుదలై ఘన విజయం సాధించింది. కరోనా పరిస్థితులు లేకపోతే సినిమా మరిన్ని కలెక్షన్లు సాధించేదని అభిమానులే కాదు.. ట్రేడ్ వర్గాలు కూడా అభిప్రాయపడ్డాయి. మూడేళ్ల గ్యాప్ తర్వాత చేయడంతో పవన్ కు కమ్ బ్యాక్ మూవీ అయింది. దీంతో ఎన్నో అంచనాలతో వచ్చి వాటని అభిమానులు, ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ డైలాగ్స్, నటన, మేకోవర్, బాడీ లాంగ్వేజ్ అన్నీ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాయి. దీనిపై సినిమాలో నటించిన శివ అనే యాక్టర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘పాలిటిక్స్ లో బిజీగా ఉంటూ అటు.. ఇటు ట్రావెల్ అవుతూ ఈ సినిమాలో నటించారు. ఆయన్ను చూస్తే నిద్రపోయారని అనిపించేది కాదు. మీటింగ్స్ కు వెళ్లడం.. నేరుగా అక్కడి నుంచి వచ్చి షూటింగ్స్ లో పాల్గొనడం చేసేవారు. ఆయన ప్రతి సన్నివేశంలో 8 నుంచి 10 పేజీల డైలాగులు ఉండేవి. చుట్టూ 8 కెమెరాల సెటప్ మధ్య ఏమాత్రం అలసట లేకుండా అన్ని డైలాగులను సింగిల్ టేక్ లో చెప్పేసేవారు. ఇవన్నీ చెప్తే వినేవి కావు.. చూస్తే ఆయన గొప్పదనం తెలుస్తుంది. అప్పుడనిపించింది.. స్టార్ హీరోలు.. పవర్ స్టార్లు ఊరికే అయపోరు’ అని శివ చెప్పుకొచ్చాడు.
సినిమా సెకండాఫ్ లో పవన్-ప్రకాశ్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సన్నివేశాల్లో పవన్ తన డైలాగులను చాలా ఫెరోషియస్ గా చెప్పిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వేగంగా జరిగిందనే చెప్పాలి. కాకపోతే.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏడాది లేట్ గా రిలీజ్ అయింది. ఉదయం విజయవాడ వెళ్లి మధ్యాహ్నానికి హైదరాబాద్ వచ్చి సినిమా షూటింగ్ పవన్ పాల్గొంటున్నారనే వార్తలు గతంలోనే వచ్చాయి. ఇప్పుడు శివ చెప్పిన మాటలు వాటిని నిజం చేస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.