ఎల్లో అలా..! బ్లూ ఇలా..! “పింక్ డైమండ్” నాయకులదా..!? నారాయణుడిదా..!?

“న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక ప్రతినిధి

తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ కథ ఎడతెగనిది..! అయోమయంతో కూడిన.. అర్థం లేని కథ…! ఈ వివాదాన్ని మొదటినుంచి ఫాలో అవుతున్న శ్రీవారి సగటు భక్తుడికి తీవ్ర గందరగోళం చేసే వినూత్న కథ..!! అసలు స్వామివారికి పింక్ డైమండ్ ఉందా..? ఉంటే ఏమైంది..? లేకపోతే అసలు ఈ వివాదం ఎందుకు రేగింది? కోర్టు మెట్లు ఎక్కే వరకు ఎలా వెళ్ళింది? తర్వాత అసలు పింక్ డైమండ్ ఏ లేదని మాట ఎందుకు వచ్చింది? అది ఒకవేళ ముక్కలైతే దాని అవశేషాలు ఎక్కడ? వైయస్సార్సీపి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీవారి నగలు ప్రదర్శన పెడతామన్న మాట ఏమైంది? నగలన్నీ లెక్కించి పింక్ డైమండ్ కథ తేలుస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయి?, వంటి అనేక ప్రశ్నలు సగటు భక్తులను తొలిచేస్తున్నాయి..!

రమణదీక్షితులు ఎందుకు చెప్పారు..?

శ్రీవారి పింక్ డైమండ్ మాయం అంటూ ఈ వివాదాన్ని మొదలెట్టింది మాత్రం అప్పటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. కొన్ని వందల కోట్ల విలువ చేసే అత్యంత పురాతనమైన వజ్రమని, చంద్రిక వజ్రం తరహాలో ఉండే దీన్ని విలువ ప్రస్తుత మార్కెట్లో రూ. వేల కోట్లు ఉంటుందని.., దాన్ని కావాలని కొందరు మాయం చేసి విదేశాలకు తరలించారని ఆయనే ఆరోపించారు. స్వయాన శ్రీవారి సేవలో ప్రధానంగా ఉండే కీలక వ్యక్తి ఈ ఆరోపణలు చేయడం ఇది ప్రపంచ హిందూ సమాజంలో కలవరానికి గురి చేసింది. దీని తర్వాత రాజకీయ వేడి మొదలైంది. విజయసాయిరెడ్డి ఏకంగా ఆ పింక్ డైమండ్ తెదేపా నేతలు ఇజ్రాయెల్లో అమ్మారని.. చంద్రబాబు నివాసంలో సోదాలు చేస్తే మరిన్ని శ్రీవారి నగల లభ్యమవుతాయి… అంటూ ఆరోపణలు చేయడం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. అయితే అప్పటి ప్రభుత్వం రమణదీక్షితులు లకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎదురు దాడికి దిగారు. అయితే పింక్ డైమండ్ వ్యవహారంపై ఎలాంటి కమిటీ గాని తర్వాత ఎలాంటి విచారణ గాని జరగకపోవడంతో ఆ విషయం మరుగున పడింది. ఇది అప్పటి టిడిపి ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోయింది. పింక్ డైమండ్ విషయంలో అప్పటి ప్రభుత్వం తీరును హిందూ ధార్మిక సంస్థలు ఎండగట్టాయి.

ఎవరి పరువు ఎవరికి నష్టం..?

శ్రీవారి పింక్ డైమండ్ విషయంలో అప్పటి టీటీడీ అధికారుల అతి స్పందన వల్లనే టీటీడీ చరిత్రలో ఒక మాయని మచ్చ ఏర్పడింది. పింక్ డైమండ్ పోయిందని రమణదీక్షితులు వంటి వ్యక్తి చెప్పగానే వెంటనే స్పందించని అధికారులు అది రాజకీయ వేడిలో ఉన్నప్పుడు ఒక్క సారిగా విలేకరుల సమావేశం పెట్టి అసలు స్వామివారికి పింక్ డైమండ్ అనేదే లేదని చెప్పారు. రూబీ తరహా వజ్రం సైతం స్వామివారికి భక్తులు చిల్లర పైసలు విసిరే సమయంలో ఆ వజ్రం పగిలిపోయింది అని మరో వాదన తెరపైకి తెచ్చారు. మరో సందర్భంలో తితిదే అధికారులు వజ్రం విషయాన్ని చెప్పకుండా కేవలం రాజకీయ ఆరోపణలు విమర్శలు మీద ఎదురు దాడికి దిగారు. అప్పటికప్పుడు పాలకవర్గంలో తీర్మానం చేసి విజయసాయిరెడ్డి, రమణదీక్షితులు మీద రూ. 200 కోట్ల పరువు నష్టం దావా వేశారు.

అంతన్నారు ఇంతన్నారు ఎంత చేశారు..!?

వైయస్సార్సీపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ధర్మకర్త మండలిని జంబోజెట్ గా రూపొందించారు. జగన్వై బాబాయి సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ గా చేశారు. ధర్మకర్తల మండలి రెండో సమావేశంలోనే తితిదే గతంలో వేసిన పరువు నష్టం దావా కేసు వెనక్కు తీసుకోవాలని తీర్మానించింది. అంటే శ్రీవారి సొమ్ము రూ. రెండు కోట్ల నిధులు కోర్టుకు సమర్పయామి చేశారన్న మాట. దీని నుంచి బయటపడేందుకు వై.వి.సుబ్బారెడ్డి ఏకంగా స్వామివారి నగలను ప్రదర్శనకు ఉంచుతామని మరోమారు లెక్కిస్తామని విషయాన్నీ చల్లబరిచే ప్రయత్నం చేశారు. అయితే దాని తర్వాత శ్రీవారి నగలను లెక్కించింది లేదు, ప్రదర్శనకు ఉంచింది లేదు. దీంతో మరోమారు పింక్ డైమండ్ కథ ఏమయిందో సగటు భక్తుడికి అర్థంకాని మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

అసలు పింక్ డైమండ్ ఉందా..??

శ్రీవారి నగలను 1950 తర్వాత మాత్రమే తిరువ భరణ బుక్ లో నమోదు చేస్తున్నారు. అప్పటివరకూ మహంతుల పాలన సాగేది. హతిరాంజీ మహంతులు ఆధీనంలోనే శ్రీ వారి ఆస్తులు నగలు ఇతర వ్యవహారాలన్నీ నడిచేవి. 1950 వరకు ఈ పద్ధతి కొనసాగింది. దాని తర్వాత శ్రీవారి నగలను ఆస్తులను ఇతర ఈ విషయాలను పూర్తిగా పరిగణలోకి తీసుకొని టీటీడీ బోర్డును ఏర్పాటు చేశారు. శ్రీవారి నగలను పూర్తిగా ఎంత బరువు ఎంత నాణ్యత ఎన్ని రాళ్లు ఉన్నాయి దాని కాలం విలువను అన్నిటిని లెక్కించి శ్రీవారి నగలను నమోదు చేసే బుక్ ను తిరువ భరణం రిజిస్టర్ గా పేరు పెట్టారు. అయితే స్వామివారికి గతంలో శ్రీకృష్ణదేవరాయలు సమయంలో వచ్చిన అత్యంత విలువైన నగలను దీనిలో నమోదు చేయలేదని అంశం ఓ మారు వివాదానికి తెరలేపింది. మాయమైన పింక్ డైమండ్ సైతం తిరువాభరణం రిజిస్టర్లో నమోదు కాలేదని, దీన్నే కావాలని అంతర్జాతీయ మార్కెట్లో ని డిమాండ్కు అనుగుణంగా అమ్ముకున్నారని విమర్శకులు చెబుతున్న మాట. అయితే స్వామి వారి మెడలో రమణదీక్షితులు చూపించిన డైమండ్ కు, తర్వాత వివాదం నేపథ్యంలో తితిదే అధికారులు చూపించిన డైమండ్ కు అసలు పోలికలు లేకపోవడం విశేషం. అంటే రమణదీక్షితులు చెబుతున్నా పింక్ డైమండ్ ఏమయింది..? కనీసం అది స్వామివారి ఖజానాలో ఉండాలి కదా అనేది ఇప్పటికీ అంతుబట్టని ప్రశ్న. ఒకవేళ పింక్ డైమండ్ కనుక మాయమైతే దాని తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విచారణ ఎందుకు నిర్వహించలేదు? అప్పటి అధికారులు చెప్పిందే తప్పు అయితే టిడిపి ప్రభుత్వంలో పనిచేసిన ఈఓ ను సంవత్సరం పాటు ఎందుకు కొనసాగించారు అనేది రాజకీయ వర్గాలకు మాత్రమే అర్ధమయ్యే విషయం.. మొత్తం ఈ వ్యవహారంలో నిత్య అయోమయానికి, సమాధానం దొరకని సందిగ్దంలోకి జారుకున్నది కేవలం శ్రీవారి సగటు భక్తుడు మాత్రమే..!!