శివసేన ఇంకా ప్రభుత్వంలో ఎందుకు?

కాపలాదారే దొంగ అంటూ ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలు గుప్పిస్తూ తన అధికారిక పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసిన శివసేనపై ఆర్ఎస్ఎస్ విరుచుకుపడుతోంది. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వెలువడే మరాఠీ దినపత్రిక తరుణ్ భారత్ శివసేనపై తీవ్ర విమర్శలతో కథనాన్ని ప్రచురించింది. కాపలాదారే దొంగ అంటూ ప్రధానిపై విమర్శలతో సంపాదకీయాన్ని ప్రచురించడాన్ని తప్పుపట్టింది. శివసేన అభిప్రాయం అదే అయితే ఆ పార్టీ ఇంకా కేంద్రంలోనూ, మహారాష్ట్రలోనూ సంకీర్ణ ప్రభుత్వంతో ఎందుకు కొనసాగుతోందని ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు శివసేన అధినేత ఉధవ్ ధాక్రే బదులివ్వాలని నిలదీసింది.

కాపలాదారే దొంగ అన్న నినాదంతో శివసేన అధినేత ఉధవ్ థాక్రే స్వయంగా తాను, తన పార్టీకి చెందిన మంత్రులూ దొంగలని అంగీకరించినట్లైందని తరుణ్ దినపత్రిక పేర్కొంది. ప్రధాని అవినీతి పరుడన్న శివసేన తక్షణమే కేంద్రంలోని, మహారాష్ట్రలోనూ ప్రభుత్వం నుంచి వైదొలగాలని పేర్కొంది.   బాలాసాహెబ్ థాకరే హయాంలో శివసేనకూ…ఇప్పటి శివసేనకూ చాలా తేడా ఉందని ‘తరుణ్’ పత్రిక పేర్కొంది.