Pawan Kalyan-TDP: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టు అయి జైలు పాలైయ్యారు. ఈ పరిణామం టీడీపీ శ్రేణులను తీవ్ర భంగపాటుకు గురి చేసింది. టీడీపీ ఓ విధంగా కష్టాంలో పడిపోయింది. అయితే ఈ కష్టకాలంలో ఎవరైనా సంఘీభావం తెలియజేయడం, మద్దతు ఇవ్వడాన్ని ఎవరైనా స్వాగతిస్తారు. అయితే చంద్రబాబు అరెస్టు అనంతరం జనసేన అధినేత పవన్ స్పందించిన తీరుపై వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి విజయవాడకు బయలు దేరడం, పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మార్గంలో బయలుదేరి వచ్చి నానా హంగామా సృష్టించడం, తీవ్రంగా స్పందించడం పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ దూకుడు చూస్తుంటే .. ఈ సమయాన్ని క్యాష్ చేసుకుని రాజకీయంగా బలపడాలని చూస్తున్నారా అన్న అనుమానం కొందరు టీడీపీ నేతల్లోనూ కలుగుతోందట.

పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో రావడంలో అధికార వైసీపీ ప్లాన్ కూడా ఉందని అంటున్నారు. ప్రత్యేక విమానం ద్వారా రావడాన్ని అడ్డుకుంటే ఆయన రోడ్డు మార్గంలో హడావుడిగా బయలుదేరతారు, దీన్ని అవకాశం చేసుకుని రోడ్డు పై ఆయనను నిలువరిస్తే పవన్, ఆయన అభిమానుల నిరసన మీడియాలో హైలెట్ అయి చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్ డైవర్ట్ అవుతుందని భావించారని, వారు అనుకున్నట్లుగానే పవన్ రోడ్డు మార్గంలో రావడం, అనుమంచిపల్లి వద్ద అడ్డుకోవడంతో రోడ్డు పై పడుకుని నిరసన తెలియజేయడం జరిగింది. కొద్ది గంటల పాటు మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో వచ్చినా గన్నవరం విమానాశ్రయం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళగిరి పార్టీ కార్యాలయంలో వదిలిపెట్టే అవకాశం ఉంటుంది. కానీ అలా జరగకుండా బేగంపేట విమానాశ్రయానికి పవన్ వెళ్లడం, అక్కడ గంట పాటు వెయిట్ చేయడం, ఆ తర్వాత రోడ్డు మార్గంలో బయలుదేరడం, అనుమంచిపల్లి వద్ద పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేయడం, ఆ తర్వాత ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళగిరి పార్టీ కార్యాలయంలో వదిలిపెట్టడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ వ్యవహారాన్ని టీడీపీ అనుకూల మీడియా అంత హైలెట్ చేయలేదు. చంద్రబాబు ఎపిసోడ్ నే హైలెట్ చేశాయి.

అంతే కాకుండా చంద్రబాబు రిమాండ్ ఉత్తర్వులు వెలువడిన వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే చంద్రబాబు కు మద్దతుగా మాట్లాడారు. ఇదే క్రమంలో తనపై అపొహా పడకుండా ఉండేందుకు గతంలో విశాఖలో తనను పోలీసులు ఇబ్బందులు పెట్టిన సందర్భంగా చంద్రబాబు తనకు సంఘీభావం తెలియజేసిన విషయాన్ని గుర్తు చేస్తూ అందుకే నేడు చంద్రబాబుకు నైతిక మద్దతు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. అయితే పవన్ దూకుడుగా వ్యవహరిస్తున్న తీరు పై ఆయన జనసేన అధ్యక్షుడా లేక టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంటా అని మాట్లాడుకుంటున్నారుట.చంద్రబాబు రిమాండ్ లో ఉంటే రాష్ట్ర రాజకీయాల్లో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం లోకేష్ కాదనీ, తానేనని పవన్ నిరూపించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారా అనే మాట ప్రత్యర్ధుల నుండి వినబడుతోంది.

మరో పక్క తన మిత్ర పక్షం బీజేపీతో సంబంధం లేకుండానే టీడీపీ బంద్ కు మద్దతు ప్రకటించారు పవన్ కళ్యాణ్. జనసైనికులు కూడా బంద్ లో శాంతియుతంగా పాల్గొనాలని పిలుపు నిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పేరుతో టీడీపీ బంద్ కు మద్దతు తెలియజేస్తున్నట్లు గా బీజేపీ లెటర్ హెడ్ పై ఓ ప్రకటన సోషల్ మీడిాయలో సర్క్యూలేట్ కాగా అది ఫేక్ అంటూ దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. బీజేపీ ఆ ఫేక్ ప్రకటనపై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఏపీలో జనసేనతో కలిసి ప్రత్యామ్యాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ పార్టీ పెద్దల సహకారంతోనే ఇవన్నీ జరుగుతున్నాయా అనే అనుమానాలు టీడీపీ వర్గాల్లో కలుగుతున్నాయిట,