కొలంబియాలో కూలిన విమానం

కొలంబియా, మార్చి 10 : కొలంబియాలో విమానం కూలిన ఘటనలో 12 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో తరైరా, డోరిస్‌ గ్రామాల మేయర్‌, ఆయన కుటుంబ సభ్యులు కూడా చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

డగ్లస్‌ డిసి-3 విమానం శాన్‌జోస్‌ డెల్‌ గౌవైరే, విల్లావిసెన్సియా పట్టణాల మధ్య అకస్మాత్తుగా కూలిపోయిందని అధికారులు తెలిపారు. కూలిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకుందని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు.

విమాన ఇంజిన్‌ వైఫల్యమే ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. కొలంబియా పౌర విమానయాన సంస్థ మాత్రం ప్రమాదానికి సంబంధించిన కారణాలు వెల్లడించలేదు.

విమానం ప్రయాణించిన సమయంలో ప్రతికూల వాతావరణం ఏమీ లేదని అధికారులు వివరించారు. విమాన ప్రమాదంలో ఎవరూ బతికి బయటపడలేదని తెలిపారు.