యుపిలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు

ఢిల్లీ, ఫిబ్రవరి 22: ఉగ్రవాద గ్రూపుతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో  ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ డిజిపి ఒపి సింగ్ తెలిపారు. శుక్రవారం ఆయన మిడియాతో వివరాలను వెల్లడించారు.

పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో నిఘా వర్గాల సమాచారం మేరకు యూపీ యాంటీ టెరరిస్ట్‌ స్క్వాడ్‌(ఏటీఎస్‌) విస్తృత తనిఖీ చేపట్టింది.

సహరన్‌పూర్‌ జిల్లా దేవబంద్‌ ప్రాంతంలో జైషే మహ్మద్‌ ఉగ్ర ముఠాతో సంబంధమున్న షానవాజ్‌ అహ్మద్‌, అఖిబ్‌ అహ్మద్ మాలిక్‌లను స్క్వాడ్ బృందం అరెస్టు చేసినట్లు సింగ్ తెలిపారు.

వీరిద్దరూ కశ్మీర్‌కు చెందినవారేననీ, షానవాజ్‌ స్వస్థలం కుల్గాం అని,  మాలిక్‌ది పుల్వామా అని ఆయన చెప్పారు. వీరి నుంచి రెండు ఆయుధాలు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  వీరిలో షానవాజ్‌ గ్రనేడ్‌ తయారీలో‌ నిపుణుడు అని డీజీపీ ఓపి సింగ్‌ తెలిపారు.

వీరు పుల్వామా ఉగ్రదాడికి ముందే ఇక్కడకు వచ్చారా, తర్వాత వచ్చారా అన్నది ఇప్పుడే చెప్పలేమనీ,  దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.  అరెస్టుపై జమ్ము కశ్మీర్‌ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చామని డిజిపి ఓపి సింగ్‌ తెలిపారు.